జనసేనాని విమర్శల ఘాటును విశాఖ తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. లోలోపల ఉడికిపోతున్నారు. ముఖం గంటు పెట్టుకుని మీడియా ముందుకు వస్తున్నారు. తాము సుద్ద పూసలమని చెప్పుకుంటూ పవన్ కు రాజకీయ అనుభవం లేదంటూ ఓ బండ పడేస్తున్నారు. పోనీ పవన్ మీద లీగల్ గా ఫైట్ చేయొచ్చుగా అంటే మాత్రం ముందుకు రావడం లేదు. ఇంతకీ  తమ్ముళ్ళపై పవన్ చేసినవి నిందారోపణలా, నిజాలా...


భూములు టీడీపీ అబ్బ సొత్తా :



విశాఖలో టీడీపీ దోపీడీకి అంతూ పొంతూ లేకుండా పోయిందంటూ పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. జిల్లాలోని పెందుర్తి, చోడవరం, గాజువాక సభలలో ఆయన మాట్లాడుతూ దోచేయడానికి భూములు మీ అబ్బ సొత్తా అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.  కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయితే చాలు, మొత్తం ఫ్యామిలీ దిగిపోతోంది, తండ్రీ కొడుకూ, మామా అల్లుడూ, అన్నా, తమ్ముడూ, ఇలా అంతా కలసి జనంపై పడిపోతున్నారంటూ మాటలతో చెలరేగిపోతున్నారు. . వీళ్ళను ఇంకా ఆపకపోతే విశాఖ డాల్ఫిన్ కొండలను సైతం మింగేస్తారంటూ పంచ్ డైలాగులు పేల్చుతున్నారు.  రాజ్యాంగం మీకు పట్టదా, చట్టాలు వర్తించవా, మీరు అవినీతి చేస్తూంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ పవన్ తమ్ముళ్ళకు తలంటేస్తున్నారు. . అవినీతి చేస్తే గల్లా పట్టుకుంటాం, ఆ గబ్బు వదిలించేస్తామంటూ గట్టి వార్నింగులు ఇస్తున్నారు.



సీనియర్ ఎమ్మెల్యేకు షాక్ :



పెందుర్తిలోని దళితుల భూములు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే దోచుకున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో బండారు సత్యానారాయణ మూర్తికి షాక్ తగిలింది. తండ్రీ కొడుకులు భూ కబ్జాలు చేస్తున్నారంటూ జనసేనాని కామెంట్స్ కు బండారు నీవు వచ్చి చూశావా అంటూ కౌంటర్ అటాక్ చేసారు. పవన్ కు రాజకీయ అవగాహన లేదన్నారు. నిన్నటి వరకు మమ్మల్ని పొగిడి ఇవలా తిట్టడమేంటని ఉడుక్కున్నారు. ఇంత రచ్చ చేసినా పవన్ మీద లీగల్ గా ప్రొసీడ్ కానని ఈ సీనియర్ ఎమ్మెల్యే అనడమే కొస మెరుపు.  



గుర్రుమీదున్న నేతాశ్రీలు :



పవన్ తమ సొంత ఏరియాల్లోనే మీటింగులు పెడుతూ బాహటంగా బట్టలూడిస్తూంటే సిగ్గు పోతోందని తమ్ముళ్ళు తెగ బాధ పడిపోతున్నారు. పవన్ పార్టీ తెలియకపోయినా, ఆయన రాజకీయం అర్ధం కాకపోయినా సినిమా గ్లామర్ తో జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారిని చూసి రెచ్చిపోతున్న పవన్ తమ ఇలాకాలోనే తమ జనం ముందే తిడుతూంటే తట్టుకోలేకపొతున్నారు. పవన్ చెప్పేది జనంలోకి ఎక్కితే తమ బతుకు బస్టాండేనని తమ్ముళ్ళు పరేషాన్ అవుతున్నారు. పవన్ పెడుతున్న పొగతో కక్క లేక మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: