వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం తిరుమల. ఆ తిరుమలతో పాటు తిరుపతి కూడా ఆధ్యాత్మిక క్షేత్రాలతో కళకళలాడుతున్నాయి. అయితే స్వామివారిని అండగా పెట్టుకుని కొంతమంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అడ్డంగా భూములను దోచుకుంటున్నారు. అంతేకాక.. అక్రమ అమ్మకాలు చేపట్టి అందిన కాడికి నొక్కేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే హథీంరాంజీ మఠం భూముల పరిస్థితి ఇదే.! కళ్లముందే కర్పూరంలా కరిగిపోతున్నా.. రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయశాఖ అధికారులు, మఠం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హథీరాంజీ మఠం భూములకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి రిజిస్ట్రేషన్ లు చేసుకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. దీంతో నిషేధిత జాబితాలో ఉన్న భూములు యధేచ్చగా అక్రమార్కులు పాలవుతున్నాయి.

Image result for Hathiramji mutt lands

తిరుపతి నగరాన్ని ఆనుకుని ఉన్న అవిలాల గ్రామం సర్వే నెంబర్ 13,15,17 లో హథీరాంజీ మఠం భూముల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ సర్వే నంబర్లలో ఉన్న భూములకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని, రిజిస్ట్రేషన్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోర్డులు పెట్టారు. కానీ హథీరాంజీ మఠం భూములకు వారసులమని చెప్పుకుంటూ... కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కొంతమంది తమకు అమ్మకాలు చేశారంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆపై భూముల్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువైన భూములన్నీ కళ్లముందే అన్యాక్రాంతం అవుతున్నా.. ఏమాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు హథీరాంజీ మఠం, దేవాదాయశాఖ అధికారులు.

Image result for Hathiramji mutt lands

కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. ఎలాంటి అమ్మకాలు, చేయకూడదని నిబంధనలు ఉన్నా.. ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. సర్వే నెంబర్ 13 లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ లు చేయించుకున్నారు. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం వ్యవసాయ భూములు అయినప్పటికి ప్లాట్ లుగా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. సిరినివాసం మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ లు చేయించుకున్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, అమ్మకాలు చేపట్టకూడదు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఫైనల్ తీర్పు వచ్చాకనే తుది నిర్ణయం ఆధారపడి ఉన్నా.. అక్రమార్కులు సుప్రీంకోర్టు ఆర్డర్ ను చూపించి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ తిరుపతి నగరంలో టైటిల్ లేకుండా భూములు ఏవిధంగా కొనుగోలు చేసినా అవి ఏవిధంగాను చెల్లుబాటు కావని చెప్తున్నారు న్యాయనిపుణులు..

Image result for Hathiramji mutt lands

రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్న విలువైన హథీరాంజీ మఠం భూములు యధేచ్చగా అక్రమార్కులు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అయితే,రాజకీయ అండదండలు, చట్టపరంగా లొసుగుల్ని ఆధారంగా చేసుకుని స్టేలు తెచ్చుకుంటూ కొన్ని ఎకరాల్లో భూములు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లు భూములు ఆక్రమించి ఇక్కడ అత్యాధునిక భవన నిర్మాణాలు చేశారని,కోర్టు ఆదేశాలు ఉన్నా ఇక్కడ ఏమాత్రం లెక్కచేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదంటున్నారు. హథీరాంజీ మఠం భూములు అమ్మాలంటే..బహిరంగ వేలం ద్వారా చేయాల్సి ఉంది..కానీ ఎక్కడ అవి అమలుకాకుండా... కోర్టు స్టే లతో.. దోడ్డిదారుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు తిరుపతి వాసులు. కోట్లాది రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నా... ప్రభుత్వం కానీ, మఠం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: