తెలంగాణ పార్టీల్లో హడావుడి మొదలైంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన మేరకు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు ప్రధాన రాజకీయ పక్షాలను బ్యాలెట్‌ కురుక్షేత్రంలోకి పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వ్యూహరచనలో మునిగిపోయాయి. ఐదు నెలల తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నగారా మోగవచ్చనే సంకేతాల నేపథ్యంలో పార్టీలన్నీ తమ తమ కోణాల్లో కసరత్తు ప్రారంభించాయి. ఐదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించామనే ప్రచారంతో.. మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో టీఆర్‌ఎస్‌ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న స్థానాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Image result for telangana politics

            పార్టీ, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతమై రాజకీయంగానూ మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, పార్టీపరంగానూ ఎన్నికల ప్రణాళికను ఆచరణలో పెడుతున్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేస్తున్నారు. ఇప్పటి వరకు బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయని ప్రాంతాలపై దృష్టి సారించారు. ఒక్కో బూత్‌ కమిటీని 20 మందితో ఏర్పాటు చేసి, గ్రామంలోని ప్రతి వంద మందికి ఒక ఇన్‌చార్జిని నియమిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ‘కేసీఆర్‌ రుణం తీర్చుకుందాం’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని టీఆర్‌ఎస్ లోని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణాన్ని సుసాధ్యం చేస్తున్న కేసీఆర్‌ రుణం తీర్చుకోవడానికి టీఆర్‌ఎస్ కే మళ్లీ ఓటు వేయాలి.. అని తాము ప్రజలకు చెప్పబోతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Image result for telangana politics

            టీఆరెఎస్ ప్రణాళికలు అలా ఉంటే.. తెలంగాణ ఇచ్చి కూడా 2014 ఎన్నికల బరిలో బోల్తా పడ్డ కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్‌లోనే ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. సన్నద్ధతలో భాగంగా ఇప్పటికే బస్సుయాత్రలకు కాంగ్రెస్‌ తెర తీసింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌లతో పాటు ఉత్తర తెలంగాణను దాదాపుగా చుట్టేసింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు అధికారంలోకి వస్తే తామేం చేస్తామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 2 లక్షల వరకు రైతులకు ఏకకాల రుణమాఫీ, నెలకు 3వేల నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు, పంటల గిట్టుబాటు ధరల కోసం మార్కెట్‌ స్థిరీకరణ నిధి వంటి ప్రజాకర్షక పథకాలను ప్రజల ముందు పెట్టింది. మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో పడింది.

Image result for telangana politics

            పార్టీపరంగా అనేక కమిటీలు వేసుకుని పని విభజన చేసుకునే కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది కాంగ్రెస్. పీసీసీ మాజీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి పటిష్ట వ్యూహంతో వెళ్లేలా కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దృష్టి సారించింది. ప్రతి కార్యకర్తనూ ఎన్నికల పోరులో ఉపయోగించుకునేలా ‘శక్తి యాప్‌’ పేరుతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కూ తెర తీసింది. కానీ నేతల్లో అనైక్యత ఎన్నికల వేళ నష్టం కలిగించవచ్చనే ఆందోళన కూడా అధిష్టానంలో ఉంది. అందుకే నేతల మధ్య ఐక్యత కోసం దిల్లీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు నేతలంతా మూకుమ్మడి పాదయాత్రలకు శ్రీకారం చుట్టే అవకాశాలూ కన్పిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ పెద్దలు కూడా తెలంగాణపై దృష్టి సారించారు. ఏకకాల ఎన్నికలు నిర్వహించే యోచనతో కదులుతున్న బీజేపీ.. తెలంగాణలో నాలుగైదు లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీపరంగా బలంగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాలకు తోడు వరంగల్, భువనగిరి, నిజామాబాద్‌ నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది.       

Image result for telangana politics

            వీటితో పాటు.. టీడీపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, హైదరాబాద్‌లో గణనీయ స్థానాలు గెలుచుకునే సత్తా ఉన్న మజ్లిస్‌ కూడా ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్నాయి. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం రెడీ అంటున్నాయి తెలంగాణలోని పార్టీలు. మరి వాటిలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: