ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. విపక్షం సంగతి సరే సరి. స్వపక్షంలోనూ టైం చూసుకుని మరీ అధినేతకు షాకులిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు 2019 లో పోటీ చేసేది లేదంటూ తాజాగా బాంబు పేల్చారు. ఇప్పటికే  బాగా అలసిపోయానని ఇక రిటైర్మెంట్ తీసుకుంటానని చెబుతున్నారు. బాబు అడిగినా తనది ఇదే మాట అని కూడా అంటున్నారు.


ఎందుకిలా :


సీనియర్లే కాడి వదిలేస్తే క్లిష్ట కాలంలో పార్టీకి ఎలా అన్న మాట టీడీపీలో వినిపిస్తోంది. పైగా అది చెడు సంకేతాలు ఇస్తుందని, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. నిజానికి 2019 ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి. ఆ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని బాబు పంతం మీద ఉన్నారు. బయట పరిస్థితి చూస్తే వ్యతిరేకంగా ఉంది. ఈ సమయంలో సీనియర్లు  సహకరించకపోగా మరింతగా పొగ పెడుతున్నారని అంటున్నారు. 


అద్గదీ సంగతి :


రాజకీయాలలొ రిటైర్మెంట్లు ఉండవు,  జనం పక్కన పెడితేనే తప్ప. అయ్యన విషయంలోనూ అదే జరుగుతోందంట.  నర్శీపట్నంలో పోయిన ఎన్నికలలో ఆయన చావు తప్పి కన్ను లొట్టబొయిన చందంగా రెండంటే రెండు వేలతో బయటపడ్డారు. అక్కడ వైసీపీ క్యాండిడేట్ బలంగా ఉన్నారు. దానికి తోడు అయ్యన్నకు ఇంట్లోనే రాజకీయ పోరు ఉంది. వారసత్వం  కోసం తమ్ముడు, కొడుకు పోటీ పడుతున్నారు. ఈసారి పోటీకి అయ్యన్న స్వయంగా దిగినా గెలుపు అవకాశాలైతే పెద్దగా లేవన్నది వాస్తవం. అది గ్రహించే ముందు చూపుతో రాజకీయ రిటైర్మెంట్ పాటను మంత్రి గారు అందుకున్నారని టాక్.


టీడీపీదే పవర్ ట :


తన సీటు మీద నమ్మకం లేని మంత్రి గారు ఏపీ పాలిటిక్స్ మీద మాత్రం బ్రహ్మాండమైన జోస్యం చెప్పారు. ఏపీలో మళ్ళీ టీడీపీదే పవర్ ట. ప్రజలకు అంతకు మించిన ఆప్షన్ కూడా లేదట. ఎంతో అభివ్రుధ్ధి చేసిన టీడీపీకే తప్పక ఓట్లు వేస్తారట. హంగ్ వంటి భయాలు లేవని, పవన్ కు ఓట్లూ. సీట్లూ రానే రావని అయ్యన్న ధీమాగా ఉన్నారు. మంచి మెజారిటీతో టీడీపీయే వస్తుందని, బాబు సీఎం అవడం ఖాయమని చెబుతున్నారు. మరి అంతా బాగుంటే నీవెందుకు పోటీ చేయవన్న మాట  అంటే మాత్రం సమాధానం దొరకదంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: