' ప్ర‌భుత్వం స్పందిచ‌కుంటే జీవోల‌ను స‌చివాల‌యంలో భోగిమంట‌లేసి త‌గ‌ల‌బెడతా '....ఇవి ఎంఎల్ఏ చేసిన తాజా వ్యాఖ్య‌లు. వ్యాఖ్య‌లు చేసింది ఏ ప్ర‌తిప‌క్ష ఎంఎల్ఏనో కాదు సుమా ! సాక్ష్యాత్తు అధికార‌పార్టీ ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు. ఎంల్ఏ మీడియాతో మాట్లాడుతూ జీవోల‌ను చూపించి వాటిని స‌చివాల‌యంలో త‌గ‌ల‌బెడ‌తానంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు వైర‌ల్ గా మారింది. 


ఉన్న‌తాధికారుల‌దే త‌ప్పు


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావ‌రి జిల్లాలో నాటు ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం అందిర‌కీ తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో మృతిచెందిన వారిలో అత్య‌ధికులు స్కూలుకు వెళుతున్న పిల్ల‌లే. దాంతో ప్ర‌మాద ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌మాదం జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత తూగోజిలోని రామ‌చంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గం ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు లంక‌ల‌కు వెళ్ళారు. దాంతో బాధితులు ఒక్క‌సారిగా ఎంఎల్ఏపై విరుచుకుప‌డ్డారు. 


ఎంఎల్ఏపై  విరుచుకుప‌డ్డ బాధితులు


అదే విష‌య‌మై ఎంఎల్ఏ మీడియాతో మాట్లాడుతూ, ప‌రామ‌ర్శ‌కు వెళ్ళిన త‌న‌పైనే బాధిత కుటుంబాలు విరుచుకుప‌డ్డాయంటూ చెప్పుకొచ్చారు.  యానాం-జొన్నాడ రోడ్డు మంజూరైనా ఇంత వ‌ర‌కూ అధికారులు పనులు ప్రారంభం కాలేద‌ని ఆరోపించారు. అదే విధంగా చాలా లంక‌ల్లో బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనా అధికారులు ప‌నులు ప్రారంభించ‌లేదంటూ మండిప‌డ్డారు. అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రిగిన‌ట్లు ఎంఎల్ఏ ఆరోపించారు.


జీవోల‌తో భోగిమంట‌లేస్తా 


అధికారులు గ‌నుక ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించ‌క‌పోతే  పై ప‌నులు మంజూరు చేస్తూ విడుద‌లైన జీవోల‌ను భోగిమంట‌లేసి స‌చివాల‌యంలోనే త‌గ‌ల‌బెడ‌తానంటూ ఎంఎల్ఏ హెచ్చ‌రించ‌టం వైర‌ల్ గా మారింది. ప్ర‌భుత్వం, ఉన్న‌తాధికారులు ఏమ‌నుకున్నా తాను లెక్క చేసేదిలేదన్నారు. ప్ర‌భుత్వంపై ఎంఎల్ఏ ఇంత ఘాటుగా మాట్లాడ‌టం విచిత్రంగా ఉంది. కొద్ది రోజులుగా తోట టిడిపిలో నుండి వైసిపిలోకి మారుతారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌ధ్యంలో ఎంఎల్ఏ తాజా హెచ్చ‌రిక‌ల‌పై సర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: