మొత్తానికి ఎన్నికల ఏడాది మంత్రి గారిని శయన మందిరం నుంచి నడి రోడ్డుపైకి లాక్కొచ్చేసింది. పూల పానుపుపై పవళించాల్సిన ఘనమైన పెద్ద మనిషి వీధిలో నలుగురి మధ్యలో ఓ మాదిరి పడక సీన్ వేయాల్సి వచ్చింది. పరుపులు, వగైరా సరంజామా  జాగ్రత్తగానే ఉందనుకోండి, అయినా ఇది గంటా వారి దర్జాకు ఏం సరిపోతుంది లెండి.  అయినా రైల్వే జోన్ అంటూ మంత్రి నిరసన రాత్రి మా బాగానే పాటించేశారు.  పక్కవారిని కూడా బాగా పడుకోబెట్టారు.


కుర్చీ ఇచ్చేస్తా... ఇస్తారా :


గంటా వారు ఉద్యమించనంతవరకే శాంతమూర్తి, ఒక్కసారి రోడ్డు ఎక్కారా ఉగ్రమూర్తి అవతారమే సుమా. అందుకే విశాఖ రైల్వే స్టేషన్ సాక్షిగా డిల్లీ పెద్దలపైనే గర్జించారు. ఇప్పటికైనా జోన్ ఇస్తారా ఇవ్వారా అంటూ హూంకరించారు. నాలుగేళ్ళుగా అదే పాట పాడుతున్నారంటూ నిందలు వేశారు. మరి ఇందులో తమ టీడీపీ అంటకాగిన పాత్ర మాత్రం మరచిపోయారనుకోండి. మీరు జోన్ ఇవ్వకపోతే నా మంత్రి పదవి వదిలేస్తానంటూ వార్నింగులూ ఇచ్చారు. మరి, మంత్రి గారి కుర్చీకీ, జోన్ కి రిలేషన్ ఏంటో వారే చెప్పాలి మరి.


చెవిటి కేంద్రమట :


మాట వినని, మొర ఆలకించని కేంద్రాన్ని చెవిటి వానితో పోల్చేశారు. ఎన్ని దీక్షలు చేసినా, మరెన్ని పోరాటాలు చేసినా వారికి వినిపించడం లేదని ఫైర్ అయ్యారు. ఏపీ విన్నపాలన్నీ బుట్టపాలు చేస్తున్నారంటూ ఆవేశపడ్డారు. ఇకపై మరింత జోరుగా పోరాడుతానని శపధం చేశారు. ఏపీ ఎంజీవోలతో కలసి కార్యక్రమం సిధ్ధం చేస్తామని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ మీదట అంతా కలసి నిద్రపోయారు. షో బాగనే వుంది. ఈ మొద్దు నిద్రకు మరి జోన్ వస్తుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: