ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి అసలు కారణం చంద్రబాబేనంటూ పార్లమెంట్ సాక్షిగా కుండ బద్దలు కొట్టారు ప్రధాని మోడీ. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత అవిశ్వాస తీర్మానానికి మోడీ గంటన్నరకు పైగా సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. ఏపీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు స్వయంగా అంగీకరించారన్నారు. ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు కూడా చెప్పారని గుర్తు చేసారు.


మీ వైఫల్యాలు మాపై రుద్దుతారా :


ఏపీలో మీ నాయకత్వ వైఫల్యాలను మాపై రుద్దుతున్నారని, పార్లమెంట్ ను టీడీపీ తన రాజకీయ లాభానికి వాడుకుంటోందని మోడీ టీడీపీని గట్టిగా  అటాక్ చేశారు. ఏపీకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని, ఉంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ అభివ్రుధ్ధే దేశాభివ్రుధ్ధి అన్నారు టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేస్తోందని హాట్ కామెంట్స్ చేసారు.


యూటర్న్ బాబు :


ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో మెమెపుడూ ఒకే మాట మీద ఉన్నాం, చంద్రబాబే యూటర్న్ తీసుకున్నారని ఫైర్ అయ్యారు. ఎండీయేను వీడిపోతున్నపుడు బాబుకు ఫోన్లో అదే చెప్పానని, మీరు వైసీపీ ఉచ్చులో చిక్కుకున్నారని హెచ్చరించానని మోదీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ కి 14వ ఆర్ధిక సంఘం అంగీకరించలేదని, పరిమితులు విధించిందని మోడీ పేర్కొన్నారు.  అయినా కూడా హోదాకు సరిపడా అన్ని సమకూర్చుతూ ప్యాకేజ్ ఇస్తున్నామని అన్నారు.


కాంగ్రెస్ తోనే ఇదంతా :


ఏపీ ఈ రోజు ఇలా ఉందంటే దానికి నాటి కాంగ్రెస్ పాలకులే కారణమని మోడీ విరుచుకుపడ్డారు. 18 ఏళ్ళ క్రితం వాజ్ పేయ్ హయాంలో మూడు రాష్ట్రాలను విభజించారని, అక్కడ అభివ్రుధ్ధి, శాంతి ఉన్నాయని, అదే కాంగ్రెస్ తన రాజకీయ లాభం కోసం ఉమ్మడి ఏపీని విడదీసిందని, అందుకే ఏపీలో ఇబ్బందులు వచ్చాయంటూ కాంగ్రెస్ ని నిందించారు. మొత్తానికి అవిశ్వాసంతో మోడీపై పట్టు సాధిద్దామనుకున్న టీడీపీకి వారి గుట్టే మోడీ  బయటేశారు



మరింత సమాచారం తెలుసుకోండి: