నిన్న పార్లమెంట్లో అవిశ్వాసం పేరిట జరిగిన రాజకీయ తంతు విపక్షాల వీక్ పాయింట్ ని లోకం మొత్తానికి చూపించేసింది. . అదే టైంలో మోడీని మించిన మొనగాడు లేడంటూ కూడా చాటేసింది. . ఆ విధంగా ఇటు  మోడీలో, అటు బీజేపీలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకా అన్నట్లు నో కాంఫిడెన్స్ మోషన్ పెట్టారనిపించింది లోక్ సభలో జరిగిన సన్నివేశాలు  చూసిన వారికి మోడీ అమాంతం ఆజానుబాహునిలా పెరిగి కనిపిస్తూంటే  ప్రతిపక్షం మరీ బలహీనంగా ఆనుతోంది.


భావి నాయకా..ఇదేం పోకడా :


అవకాశం కలసి వస్తే రేపటి రోజున దేశానికి ప్రధాని అవుతానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధి అలా ఉన్నట్లుండి మోడీ దగ్గరకు రావడం, గట్టిగా హగ్ చేసుకోవడం తిలకించిన సభికులతో పాటు దేశమూ యవత్తూ  నివ్వెరపోయింది. పోనీ పెద్దాయన మోడీ పట్ల  రాహుల్ ఏదో అభిమానం చూపించాడు అనుకునేంతలోపునే తన సీట్లోకి వస్తూనే తోటి సభ్యులకు కన్ను గీటాడు. ఇదేం వింత పోకడో అర్ధం కాని స్థితి. గంట పాటు రాహుల్ ప్రసంగం చేసి ఫరవాలేదు అనిపించుకునేంతలోనే ఇలాంటి చేష్టలతో దేశ ప్రజల మన్నన పోగొ ట్టుకున్నాడు. 


అంగుష్టమాత్రులైన వేళ :


అక్కడందరూ అంగుష్టమాత్రులైన వేళ ఆముదం చెట్టే అతి పెద్దదిగా కనిపిస్తుందేమో మరి. సభలో సరైన ప్రసంగాలు చేసే వారే కరవు అయ్యారు. ట్రూ పార్లమెంటేరియన్ కొరత చాలానే ఉందని డిబేట్ సందర్భంగా బయటపడింది. సబ్జెక్ట్ మీద పట్టున్న వారు పెద్దగా లేరనిపించింది. ఒకప్పటి పార్లమెంట్ డిబేట్స్ కి ఇప్పటికీ ఇదే పెద్ద తేడా. అందుకే తన వాక్చాతుర్యంతో మోడీ రెచ్చిపోయారు. గంటన్నర పాటు ఓ రేంజిలో స్పీచ్ ఇచ్చుకుంటూ పోయారు. ఓ విధంగా చెప్పాలంటే మన క్రికెట్ దేవుడు సచిన్ చాన్స్ దొరికితే బాదేసినట్లుగా నిన్నటి మోడీ సభ తీరు కనిపించింది. 


బోర విడిచారుగా :


మోడీపై పెట్టిన అవిశ్వాసం చాల పెద్ద తేడాతో వీగిపోయింది. ప్రతిపక్షాల బలం మొత్తం సభలో నాలుగ వంతు మించలేదు. ఇందులో కూడా ఎన్ని భేదాలు, మరెన్ని వైరుధ్యాలు చూడబోతే వీళ్ళేనా రేపటి ఎన్నికల్లో కలసి  మోడీని, బీజేపీని డీ కొట్టేది అని చూసే దేశ ప్రజలకు అనిపించక మానదు. అందుకేనేమో మోడీ ధైర్యం పెరిగింది, 130 కోట్ల జనం మద్దతు నాకుంది, 2019లోనూ మళ్ళీ నేనే పీయం అంటూ నిండు సభలోనే గర్వంగా చెప్పేశారు. ఇక ఆయన మంత్రి వర్గ సహచరుడు రాంవిలాస్ పాశ్వాన్ అయితే మరో అడుగు ముందుకేసి 2024 వరకు పీయం కుర్చీ ఖాళీ లేదనేసారు. ఏతా వాతా జరిగిందేమిటంటే ఇది అవిశ్వాసం కానే కాదు. మోడీకి తెచ్చిన ఆత్మ విశ్వాసం. అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: