వర్తమాన రాజకీయాలలో నాయకులెందరో ఉన్నారు కానీ ప్రజా నాయకులు మాత్రం లేరు. జనంలో పుట్టి వారితో మమేకమైన లీడర్లు చెప్పుకోవాలంటే వెతకాల్సిందే. ఎక్కడ చూసినా వారసత్వమే తప్ప జవసత్వమున్న నాయకత్వం కనిపించడంలేదు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన కీర్తిని గడించిన నాయకులలో చివరి తరం నేతగా  కరుణానిధినే చెప్పుకోవాలి. ఆయన పుట్టింది ఆలయాలలో నాదస్వరం వాయించే ఓ సగటు పేద కుటుంబంలో. అటువంటి వ్యక్తి ఇంతటి ఘన విజయాలు సాధిస్తారని తల్లితండ్రులే ఊహించి ఉండరేమో.


పద్నాలుగేళ్ళకే :


కరుణానిధి పద్నాలుగేళ్ళకే జనంలోకి వచ్చేశారు. అలా సమాజాన్నే చదువుతూ పెరిగిన ఆయన ఆ సమాజానికే ఓ దశ, దిశ చూపించే స్థాయికి రావడం నిజంగా గొప్ప విషయమే. ద్రవిడ ఉద్యమాన్ని భుజాన మోసి తుది వరకూ కాపు కాసిన జన నేతగా కరుణను గుర్తు చేసుకోవాలి. ఆయనకు అధికారం, పదవులు, కీర్తి అన్నీ అంత సులువుగా  రాలేదు. జనంతో కలసి పనిచేసి కష్టపడి సంపాదించుకున్నవే అవన్నీ.


వారధిగా నిలిచాడు :



కరుణానిధి గురించి తెలుసుకోవడం అంటే ఒక శతాబ్దం చరిత్రను తిరగేయడమే. స్వాతంత్రానికి ముందు పుట్టీ అనంతరం మరో డెబ్బై ఏళ్ళ పాటు జీవించిన ఆయన నాటి నేటి తరానికి అచ్చమైన వారధి. దేశంలో, సమాజంలో, రాజకీయాలలో వచ్చిన ఎన్నో మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన మరణ వార్త విన్న జనం గోడున ఏడుస్తున్నారంటే అది ఆయన సాధించుకున్న అసలైన సంపద. ఇలా తమిళనాట కొన్ని తరాలను విశేషంగా ప్రభావితం చేసిన కరుణ అస్తమయంతో ఓ శకం ముగిసిందని చెప్పాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: