సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులు లేక బోసిపోయింది.  టీటీడీ పాలకమండలి మితిమీరిన వ్యవహారంతోనే ఇలా భక్తులు రాకుండా పోయారని విమర్శలు వస్తున్నాయి. నిజానికి మహా సంప్రోక్షణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కాలంగా ప్రచారం చేస్తూ వస్తోంది. మొదట భక్తుల దర్శనాలకు అనుమతించబోమన్న టీటీడీ చివరకి చంద్రబాబు జోక్యంతో పరిమిత స్థాయిలో అనుమతులకు అంగీకరించింది. అయితే టీటీడీ అతి ప్రచారం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో  సందడి లేకుండా పోయింది. 


ఆదాయానికీ గండి :


గత రెండు రోజులుగా కూడా ఇదే పరిస్థితి. నిజానికి మహా సంప్రోక్షణానికి భక్తులను  యాభై వేల వరకూ అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కానీ మొదట్లో చేసిన అతి  కొంప ముంచింది. అతి ముఖ్యమైన మహా సంప్రోక్షణానికి కూడా సగానికి సగం మంది భక్తులు తగ్గిపొయారు. ఇక భక్తుల రాకపోకలు శుక్రవారం నుంచే మందగించాయి. దాంతో ఆ సమయంలో దర్శనానికి  వచ్చిన వాళ్ళే అద్రుష్టవంతులయ్యారు. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిందని వెళ్ళిన భక్తులు చెబుతున్నారు. ఒకటికి రెండు మార్లు కూడా ఈ వేళలలో దర్శనం చేసుకున్న వారూ ఉన్నారు. ఇక  73 లక్షలే నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం కావడం విశేషం.


మరో నాలుగు రోజులూ ఇంతే :


ఇదే  పరిస్థితి మరో నాలుగు రోజులు ఉంటుందని టీటీడీ వర్గాలు అంటుననాయి. గురువారంతో మహా సంప్రోక్షణం ముగుస్తుంది. అంతవరకూ పెద్దగా భక్తుల జాడ కనించే చాన్సే లేదంటున్నారు. అతి ప్రచారం వల్ల సాధారణ భక్తులు కూడా ఆలయానికి తగ్గిపొయారని, ఇదంతా టీటీడీలో కొందరు పెద్దల అతి ఉత్సాహమే కారణమని కొండ మీద వ్యాపారులు నిందిస్తున్నారు. సరిగ్గా 12 ఏళ్ళ క్రితం 2006లోనూ మహా సంప్రోక్షణం జరిగింది. అపుడు ఇటువంటి పరిస్థితి లేదని, భక్తులు బాగానే దర్శనానికి వచ్చారని అక్కడి అధికారులు చెప్పటం విశేషం. మొత్తానికి పాలక వర్గం, అధికారులూ కలసి భగవంతునికీ భక్తునికీ మధ్య దూరాన్ని పెంచేశారని ఆవేదన అంతటా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: