వైసిపి త‌ర‌పున మ‌రో పాద‌యాత్ర మొద‌లైది.  ఒంగోలు మాజీ ఎంపి  వైవి సుబ్బారెడ్డి ఈరోజు పాద‌యాత్ర ప్రారంభించారు. జిల్లాకు ప్రాణాధార‌మైన  వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయ‌టంపై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని నిర‌సిస్తూ  వైసిపి ఆధ్వ‌ర్యంలో పాద‌యాత్ర మొద‌లైంది.  జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో 15 రోజుల పాటు సుమారు  200 కిలోమీట‌ర్ల‌ను వైవి క‌వ‌ర్ చేస్తున్నారు. క‌నిగిరిలో ఈరోజు బ‌హిరంగ‌స‌భ‌తో మొద‌లైన పాద‌యాత్ర చివ‌రి రోజు వెలిగొండ ప్రాజెక్టు ద‌గ్గ‌ర ముగుస్తుంది. 


చంద్ర‌బాబుపై ఫైర్


క‌నిగిరిలో మొద‌లైన పాద‌యాత్ర‌ను మాజీ మంత్రి బాలినేని  శ్రీ‌నివాసుల‌రెడ్డి, నేత‌లు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆ సంద‌ర్భంగా మాట్లాడిన సుబ్బారెడ్డి చంద్ర‌బాబునాయుడుపై విరుచుకుప‌డ్డారు. వెలిగొండ ప్రాజెక్టు గ‌నుక పూర్త‌యితే జిల్లాలోని చాలా భాగానికి సాగు, తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌న్నారు. చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం వ‌ల్లే జిల్లాలోని రైతులు న‌ట్టేట ముణిగిపోయిన‌ట్లు మండిప‌డ్డారు.  పోయిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని నిల‌దీశారు. 


ఏడాదిలోపు పూర్తి 


స‌రే, కొంత సేపు చంద్ర‌బాబుపై మండిప‌డిన సుబ్బారెడ్డి తాము అధికారంలోకి వ‌స్తే ఏమి చేస్తామ‌నే విష‌యంలో హామీలు  ఇచ్చారులేండి.   తాము అధికారంలోకి రాగానే ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని వైవి కూడా హామీ ఇచ్చారు. పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.  పాద‌యాత్ర‌కు ముందు మ‌ర్రిపూడి నుండి 100 వాహ‌నాల‌తోను, పొదిలి నుండి మ‌రో 30 వాహ‌నాల‌తోను వైవికి మ‌ద్ద‌తుగా ర్యాలీ నిర్వ‌హించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: