వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ఉత్త‌రాంధ్రలో అడుగుపెట్టిన తర్వాత రాజ‌కీయంగా ఈ చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే, పోయిన ఎన్నిక‌ల్లో వైసిపి దారుణంగా దెబ్బ‌తినింది.  అప్ప‌టి నుండి ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌ప‌డాల‌ని వైసిపి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నాలు  ఎంత వ‌ర‌కూ సానుకూల‌మ‌వుతుంద‌న్న‌ది భ‌విష్య‌త్తులో కానీ తేల‌దు. ఇటువంటి నేప‌ధ్యంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా ఉత్త‌రాంధ్ర‌లోకి ప్ర‌వేశించారు. దాంతో రాబోయే ఎన్నిక‌ల్లో వైసిపి ప‌రిస్ధితి ఎలాగుంటుంద‌నే విష‌య‌మై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. 


మొదటి అడుగే అదిరిపోయింది


ప‌ది జిల్లాల్లో పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత జ‌గ‌న్ తాజాగా విశాఖ‌ప‌ట్నంలోకి అడుగుపెట్ట‌టం ద్వారా ఉత్త‌రాంధ్ర‌లోకి ప్ర‌వేశించారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం మూడు రోజులుగా జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. న‌ర్సీప‌ట్నంలో అడుగుపెట్టిన జ‌గ‌న్  మొద‌టి అడుగు మాత్రం అదిరిపోయింది.  ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పాద‌యాత్ర‌కు జ‌న‌స్పంద‌న బ్ర‌హ్మాండంగా క‌న‌బ‌డుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త ఏమిటంటే ?   తెలుగుదేశంపార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి కంచుకోట‌లాగ మారిపోయింది. ఏదో ఒక‌టి, రెండు సార్లు మాత్ర‌మే ఇత‌ర పార్టీలు గెలిచాయి. అంటే న‌ర్సీప‌ట్నం టిడిపికి అంత స్ట్రాంగ్ అన్న‌మాట‌. అటువంటిది జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌న‌స్పంద‌న చూస్తుంటే టిడిపి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.


గెలిచింది 9 నియోజ‌క‌వ‌ర్గాలే


నిజానికి ఉత్త‌రాంధ్ర‌లో విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాలున్న‌ప్ప‌టికీ చాలా మందికి ఉత్త‌రాంధ్ర అంటే ముందు  విశాఖ‌ప‌ట్న‌మే గుర్తుకువ‌స్తుంది.  పోయిన ఎన్నిక‌ల్లో మొత్తం ఉత్త‌రాంధ్ర‌లో వైసిపి బాగా దెబ్బ‌తిన్న‌ది. మూడు జిల్లాల్లో క‌లిపి వైసిపికి వ‌చ్చింది తొమ్మిది ఎంఎల్ఏ స్ధానాలు మాత్ర‌మే. మూడు జిల్లాల్లోనూ వైసిపి త‌లా మూడు నియోజ‌క‌వ‌ర్గాలు గెలిచింది. మొత్తం 34 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను గెలిచింది తొమ్మిది మాత్ర‌మే అంటే వైసిపిది ఎంత పూర్ షోనో అంద‌రికీ అర్ధ‌మ‌వుతోంది. 


మెజారిటీ సీట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి


వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకునే ఉద్దేశ్యంతోనే జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే విజ‌య‌సాయిరెడ్డిని విశాఖ‌లో క్యాంపు వేయించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడ‌వ్వ‌గానే విజ‌య‌సాయి విశాఖ‌ప‌ట్నం జిల్లాను ద‌త్త‌త తీసుకున్నారు. దాదాపు రెండేళ్ళుగా విశాఖ కేంద్రంగా విజ‌య‌సాయి మొత్తం ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ బ‌లోపేతానికి ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. నాలుగేళ్ళుగా చంద్ర‌బాబునాయుడు పాల‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో విజ‌య‌సాయి బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.  టిడిపికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌ల‌తో జ‌నాల‌ను బాగానే క‌దిలించ‌గ‌లిగింది వైసిపి. 


గ‌ట్టి  అభ్య‌ర్ధులు దొరుకుతారా ? 


ఇప్పుడు కూడా ఉత్త‌రాంధ్ర‌లో వైసిపి బ‌ల‌హీనంగానే క‌న‌బ‌డుతోంది.  15 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే వైసిపికి  గ‌ట్టి అభ్య‌ర్ధులున్నారని స‌మాచారం. మిగిలిన 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి అభ్య‌ర్ధుల కోసం ఇంకా వెతుకులాట జ‌రుగుతూనే ఉంది. నిజంగానే చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త ఉంటే ఆ ఓట్ల‌న్నీ వైసిపికే ప‌డ‌తాయ‌ని గ్యారెంటీ లేదు. జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్లు మెజారిటీ సీట్లు ద‌క్కాలంటే అన్నీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి అభ్య‌ర్ధుల‌ను పోటీలోకి దింప‌టం ఒకటే మార్గం.  పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ గ‌ట్టి అభ్య‌ర్ధుల‌ను రెడీ  చేస్తున్న‌ట్లు స‌మాచారం.  మ‌రి వ‌చ్చే ఎన్నికల్లో అయినా  వైసిపి అభ్య‌ర్ధుల‌ను ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఆద‌రిస్తారో లేదో చూడాల్సిందే. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: