ఆ సభ పేరు జ్ఞానభేరి. విధ్యార్ధులకు విజ్ఞానం అందించేందుకంటూ ఏర్పాటు చేసిన సభ. ఈ సభకు అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర. మరి ఇంతగా ప్రభుత్వం ఖర్చు చేసి నిర్వహించిన ఈ సభ హాజరైన విధ్యార్ధులకు ఏమైనా జ్ఞానం అందించారా అంటే అదేంలేదు. యధాప్రకారం రాజకీయమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ సభకు హాజరై రాజకీయ సభ కాదంటూ మొత్తం రాజకీయల గురించే మాట్లాడారు. ధర్మ పోరాట దీక్ష, గ్రామ దర్శిని, నగర దర్శిని మీటింగులలో చేసిన ప్రసంగాలే ఇక్కడా చేశారు.


విపక్షాలపై విసుర్లు :


జ్ఞానభేరి సభ వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి విపక్షాలపై మరో మారు విరుచుకుపడ్డారు. కేంద్రం సహకారం అందించడం లేదంటూ నిందించారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అసమర్ధులు అందలం ఎక్కితే అనర్ధాలే అంటూ విపక్ష వైసీపీ పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. మంచి ప్రభుత్వం కావాలంటూ తన పాలనపై చెప్పుకున్నారు. తాను నాలుగేళ్ళ పాటు ఏపీకి చాలా చేశామని బాబు తెలిపారు. 


పాలన గురించి గొప్పలు :


తన పాలన గురించి ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పిన మాటలనే పదే పదే చెప్పారు. పోలవరం జీవనాడి, దాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. విశాఖ హొదూద్ తుపాన్ లో ఎంతో చేశామని గుర్తు చేశారు. నిధులు లేకపోయినా వీధి లైట్లు, గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేశామని ముఖ్యమంత్రి చెప్పారు. సింగపూర్, దుబాయ్ వంటి నగరాలను యధాప్రకారం వల్లె వేశారు. మొత్తానికి రాజకీయ ప్రసంగమే బాబు చేశారు.


పెట్టుబడులు వస్తాయా :


విశాఖలో పెట్టుబడులు అన్నీ వస్తే ఉపాధి వస్తుందని బాబు చెప్పడం విశేషం. మరి మూడేళ్ళ పాటు వరసగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని నాడు చెప్పిన మాటలు ఇపుడు అబద్దాలు అనుకోవాలా. 16 లక్షల కోట్ల అవగాహానా ఒప్పందాలు కుదిరాయని చెప్పిన బాబు పెట్టుబడులు వస్తే ఉపాధి వస్తుందని అన్నారు. మరి ఎపుడు ఆ పెట్టుబడులు వస్తాయో ఎవరికీ  తెలియదు.    జ్ఞానభేరి సభ కోసం విధ్యార్ధులను పెద్ద ఎత్తున తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: