తెలుగుదేశం పార్టీకి బీసీల భయం పట్టుకున్నట్లుంది. ఓ వైపు కాపులను దువ్వుతూనే మరో వైపు తన సంప్రదాయ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలనుకుంటోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ బీసీలు టీడీపీ వైపు చూసేవారు. ఇపుడు వారు రెండవ ఆప్షన్ ని రెడీ చేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలో అలజడి రేపుతోంది. ఈ వర్గం చేజారకుండా కొత్త ఎత్తులకు ఆ పార్టీ దిగుతోంది. 


ఆకట్టుకోవాలని :


బీసీలను ఆకట్టుకోవాలని టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. నిజానికి అన్న నందమూరి పార్టీని ఏర్పాటు చేసిన నాటినుంచి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం వారిలో మార్పు కనిపిస్తోంది. విభజన ఏపీలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలు తమకు రాజ్యాధికారంలో తగిన వాటా కోరుతున్నారు. అంతే కాదు, కీలక పదవులూ అడుగుతున్నారు. ఇక తమ కోటాలొ ఇతర కులాలను చేర్చడాన్ని పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు.


అప్పటి నుంచే గుస్సా :


కాపులను బీసీలలో చేర్చుతామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనే బీసీలు భగ్గుమన్నారు. అయితే మూడున్నరేళ్ళుగా కాపుల విషయంలో బాబు ఎటూ తేల్చకపోవడం వెనక బీసీల భయమే కారణం. కానీ గత ఏడాది బీసీలలో కాపులను చేర్చుతూ బాబు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అప్పటి నుంచే అసంత్రుప్తి  సెగ మొదలైంది.  అది ఎటు దారితీస్తుందోనన్న బెంగ టీడీపీకి పట్టుకుంది.


ఉత్తరాంధ్రలో సదస్సు :


బీసీలను బుజ్జగించి దారిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఉత్తరాంధ్రలో త్వరలో  బీసీ సదస్సు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇక్కడ మూడు జిల్లాల్లో  బీసీలు ఎక్కువగా ఉన్నారు. పైగా ఈ ప్రాంతాలు  టీడీపీ కంచుకోటలు. ఇపుడిపుడే ఇక్కడ మార్పు కనిపిస్తోంది. దాంతో కంగారుపడుతున్న టీడీపీ మరో మారు వారిని ఆకట్టుకోవడానికి వరాల మూటను తీయబోతోంది. మరి. దారికి వస్తారా. లేదా అన్నది చూడాల్సిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: