వ‌చ్చే ఎన్నిక‌ల్లో కెసిఆర్ ను ఓడించ‌టానికి మ‌హాకూట‌మి ఏర్ప‌డింది. ఈ కూట‌మిలో కాంగ్రెస్, టిడిపితో పాటు సిపిఐ కూడా ఉంటుంది. ఈరోజు పై మూడు పార్టీ నేత‌ల మ‌ధ్య  భేటీలో ఆ మేర‌కు నిర్ణ‌యం జ‌రిగింది. కెసిఆర్ ను ఓడించ‌టానికి మ‌హాకూట‌మిగా ఫాం అవ్వ‌టం త‌ప్ప‌ద‌ని కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. 


స్ధానికంగా ఓ స్టార్ హోట‌ల్లో స‌మావేశ‌మైన కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్, టిడిపి అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ‌, సిపిఐ కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి మ‌హాకూట‌మి బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. నిజానికి పొత్తులు స‌క్ర‌మంగా జరిగి, ఓటు ట్రాన్స్ ఫ‌ర్ జ‌రిగితే కాంగ్రెస్, టిడిపి రెండు పార్టీలే సరిపోతాయి. ఎందుకంటే, రెండు పార్టీల‌కు గ‌ట్టి ఓటు బ్యాంకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల‌కున్న పార్టీ యంత్రాంగం నిజానికి టిఆర్ఎస్ కు కూడా లేద‌నే చెప్పాలి. అటువంటిది రెండు పార్టీల‌కు తోడు సిపిఐ కూడా క‌లుస్తోంది. ఈరెండింటితో పోల్చిచూస్తే సిపిఐ బ‌లం కూడా నామ‌మాత్ర‌మే. అయినా స‌రే మ్యానిఫెస్టో, బ‌హిరంగ స‌భ‌లు అన్నింటిని మూడు పార్టీలు  క‌లిసే ఏర్పాటు చేస్తార‌ట‌. 


ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే ప్ర‌తిప‌క్షాల ఓట్లు చీలిపోకూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, మిగిలిన సిపిఎం, జ‌న‌సేన‌, వైసిపి, బిజెపిలు మాత్రం మ‌హాకూట‌మిలో క‌లిసే అవ‌కాశాలు దాదాపు లేవ‌నే చెప్పాలి. అంటే ప్ర‌తిప‌క్షాల ఓట్లు చీలిక‌ను నివారించాల‌న్న ప్ర‌య‌త్నం ఆదిలోనే ఫెయిలయింద‌నే చెప్పాలి. ఇటువంటి ప్ర‌య‌త్నాల‌తో కెసిఆర్ కు జ‌రిగే న‌ష్టం ఏమిటో భ‌విష్య‌త్తే తేల్చాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: