రాజకీయాలలో ఎవరు ప్రజా సేవ అని చెప్పుకున్నా వారికి కావాల్సింది టికెట్ మాత్రమే బీ ఫారం కోసమే హై కమాండ్ చుట్టూ తిరుగుతారు, ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని వేషాలైనా వేస్తారు. మరి, అధినాయకులు అవి చూసి పడిపోతారా. వారికి కావాల్సింది జనాదరణ. ఆ లెక్కలు పక్కాగా చూసుకునే టిక్కెట్ ఇవ్వడమైనా. టిక్కు పెట్టేయడమైనా చేస్తూంటారు.


గట్టి వార్నింగ్ :


ఇంతకాలం పార్టీ పోకడ ఎలా వున్నా పెద్దగా పట్టించుకోని జగన్ ఎన్నికల వేళ మాత్రం బాగా సీరియస్ గానే అన్నీ చూస్తున్నారు. పని చేసే వారెవరో, పడకేసేవారెవరో ఎప్పటికికపుడు రిపోర్ట్స్ తెప్పించుంటున్నారు. జనంలోకి ఎవరు వెళ్ళకపోయినా టికెట్ ఇచ్చేది లేదంటూ జగన్ నాయకులకు గట్టి వార్నింగే ఇచ్చారు. విశాఖలో జరిగిన పార్టీ మీటింగులో జగన్ కుండ బద్దలు కొట్టారు. 


అన్నీ తెలుసు :


తనకు అన్నీ తెలుస్తూ ఉంటాయని, ఎప్పటికపుడు రిపోర్ట్స్ వస్తాయని జగన్ చెప్పడంతో హాజరైన వైసీపీ నాయకులు ఖంగు తిన్నారు. పాదయాత్ర చేసిన చోట వచ్చిన రెస్పాన్స్ ని కంటిన్యూ చెయాలి కదా అంటూ జగన్ క్లాస్ తీసుకోవడంతో నేతలకు చుక్కలు కనిపించాయి. జగన్ పేరు చెప్పి గెలిచేద్దామనుకుంటే కుదరదు, మీరు ప్రతీ రోజు జనంలో ఉండాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు.


అదే కొలమానం:


తాను ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే ఆ నాయకులకు జనాదరణ ఉండాల్సిందేనని జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అలా కాకుండా ఇంట్లో కూర్చుని టికెట్ అడిగితే మాత్రం ఇవ్వలేనని ఖరాఖండీగా చెప్పేసారు. దీంతో టిక్కెట్ మీద ఆశలు పెట్టుకుని వచ్చిన వారికి షాక్ తగిలినట్లైంది. మొత్తానికి చాలా కాలానికి జగన్ ఇలా పార్టీని గాడిలో పెట్టే యాక్షన్ ప్లాన్ కి దిగారని సీనియర్ నేతలు అంటున్నారు. చూడాలి ఈ క్లాస్ ఎంత వరకూ వర్కౌట్ అవుతొందో.



మరింత సమాచారం తెలుసుకోండి: