రాజు అన్న వాడు ధర్మబధ్ధంగా ఉండాలి. తీర్పు దగ్గరకు వస్తే తమ్ముడైనా, పరవాడైనా ఒకటే అన్నట్లుగా వ్యవహరించాలి. మరి మన నాయకుల తీరు అలా ఉందా అంటే ఠక్కున లేదన్న జవాబే వస్తుంది. నిజానికి ఆధ్యాత్మిక గడ్డ మన దేశం. మనది ఘనమైన వారసత్వం, ప్రతీ రోజూ పండుగే, ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. మరి వీటి నుంచి నేతాశ్రీలు ఎంత మేరకు స్పూర్తి పొందుతున్నారు.


పూజలతో సరి:


పండుగలు వస్తే శుభాకాంక్షలు  తెలియచేయడం, పూజలు చేసినట్లు పొటోలకు పోజులు ఇవ్వడంతో నాయకులు అయిందనిపిస్తున్నారు. ఇంకా విపులంగా చెప్పాలంటే మొక్కుబడిగానే అంతా చేస్తున్నారు. అక్కడా నాలుగు ఓట్ల కోసం చూసుకుంటున్నారు. ఎటు తిప్పినా  వీరికి రాజకీయమే కనిపిస్తోంది. మరి భక్తి  రసం మన నాయకుల బుర్రల్లోకి వెళ్ళదా, లేక అదేమైనా బ్రహ్మ పదార్ధమని వదిలేస్తున్నారా...


ఇతర దేశాలే నయం :


ప్రపంచంలో ఉన్న వందలాది దేశాలల్లో ఆయా మతాచారాలు బట్టి ప్రజలతో పాటు నాయకులూ నడచుకుంటున్నారు. అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు. కానీ మన నేతశ్రీల మాదిరిగా అన్నింటినీ అక్కడే ముడి పెట్టేసేలా చేయడం లేదు. చర్చికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా భక్తి భావంతోనే ఉంటున్నారు. సామన్యునిలాగానే తమ భావాలను పంచుకుంటున్నారు. 


ఆ జోలికి ఎందుకు వెళ్ళరు :


నిజానికి ఆధ్యాత్మిక రంగం అంటే   ఇహానికి కాదు,పరం  కోసమే అన్న ఆలొచన చాల మందిలో ఉంది.రాజకీయ జీవులకైతే అది తమకు అసలు సంబంధం లేని సబ్జెక్ట్ గా భావిస్తారు. కానీ ఇహానికి కూడా ఆ రంగం ఉపయోగపడుతుందని, స్పూర్తిగా తీసుకుని మంచి వైపుగా సమాజాన్ని నడిపించవచ్చునని నాయకులు మరచిపోతున్నారు.



 ఏ దేశానికైనా బలమైన పునాది ఆధ్యత్మిక రంగమే. వేయి చట్టాలు కూడా ఆపలేని ఛెడ్డ పనిని  పాపం అన్న ఒక్క మాటతో ఆపేయవచ్చు. నేరాలు లేకుండా చాలా వరకూ అరికట్టవచ్చు. మంచి చెడు అన్న వైపుగా సమాజం ఆలోచనలు మళ్ళించవచ్చు. ఆలా చేయలంటే ముందు మన నాయకులు సరిగ్గా ఉండాలి. భక్తిని కూడా మెదడులోకి ఎక్కించి ప్రజలకు మంచి చేసేలా నిత్యం తపన పడాలి. అలా తాము రోల్ మోడల్స్ గా ఉండాలి. దేశాన్ని కూడా నడిపించాలి. అపుడే ఏ పండుగకైనా అసలైన సార్ధకత.



మరింత సమాచారం తెలుసుకోండి: