ఎన్నికల టైంలో  ఎలాంటి  ఇష్యూతో జనంలోకి పోవాలో టీడీపీ తమ్ముళ్ళకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వారికి ఇపుడు బాబ్లీ అంశం బాగా దొరికేసింది. దాంతో మూడు రోజులుగా తెగ రెచ్చిపోతున్నారు. మా బాబుకు ఏమైనా  జరిగిందా చూస్కో  మా తడాఖా  అంటూ హెచ్చరికలూ చేస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఇదే టాపిక్ అయిపోయింది.


మాటల తూటాలు :


బాబ్లీపై అక్రమ ప్రాజెక్ట్ కడుతున్నారని 2010లో బాబు అండ్ కో అక్కడికి వెళ్ళి పోరాటం చేసిన సంగతి విధితమే. దానిపై మహారారాష్ట్ర ధర్మాబాద్ కోర్ట్ నాన్ బైలబుల్ వారెంట్లు బాబు తో పాటు అనేకమందికి జారీ చేసింది. ఇది ఇపుడు అతి పెద్ద మంట అయి తెలుగు రాజకీయాన్ని కుదిపేస్తోంది. బీజేపీ వల్లనే నోటీసులు అంటూ బాబుతో పాటు టీడీపీ నాయకులంతా ఆరోపిస్తూంటే మాకేంటి సంబంధం అని బీజేపీ అంటోంది. ఇదంతా డ్రామా అని కన్నా లక్ష్మీనారాయణ అంటే. బాబు నాటకాలు చేస్తున్నారని ఏకంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫైర్ అయ్యారు. 


పెట్టీ కేస్ :


అదొక పెట్టీ కేస్ అని వైసీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి అంటున్నారు. ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుకు దమ్ముంటే ఓటుకు నోటు కేసును ఎదుర్కోవాలి తప్ప ఇటువంటి చిన్న కేసు కానే కాదని సవాల్ చేశారు. బాబుపై 18 కేసులు ఉంటే అన్నింట్లోనూ స్టేలు తెచ్చుకున్నారని భూమన సెటైర్లు వేశారు. న్యాయస్థానానికి బాబు అయినా బంట్రోత్తు అయినా ఒక్కటేనని, వాయిదాలకు వెళ్ళకుంటే వారంట్ జారీ చేయరా అని ప్రశ్నించారు. తమ రాజకీయం కోసం బాబు న్యాయ వ్యవస్థకు కూడా అవినీతి అంటకట్టాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు.


చేతికి అందని నోటీస్ :


బాబుకు అరెస్ట్ వారెంట్లు ఇస్తూ జారీ అయిన నోటీసులు ఇప్పటివరకూ అందలేదని భోగట్టా.  బహుశా రేపో మాపో వచ్చే అవకాశం ఉందని సీఎం పేషీ అధికారులు చెబుతున్నారు. మరో వైపు నోటీసులే వస్తే ఏం చేయాలన్న దానిపై బాబు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మరో వైపు సుప్రీం కోర్ట్ ని కూడా ఆశ్రయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ నోటీసులు టీడీపీని కలవరపెడుతున్నాయనే అంటున్నారు.


నో టెన్షన్ :


ఇక ఎపుడూ బాబుపై విరుచుకుపడే మాజీ ఎంపీ, న్యాయవాది కూడా అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ నోటీసుల వల్ల ఏం జరగదని బాబుకు భరోసా ఇస్తున్నారు. కోర్ట్ పెర్కొన్న మేరకు విచారణకు హాజరైతే సరిపోతుందని సలహా ఇచ్చారు. ఇందులో పెద్దగా భయపడేది ఏదీ లేదని కూడా తేల్చేశారు. మరో వైపు బాబుపై అప్పట్లో కేసులు పెట్టిన కాంగ్రెస్ ఇపుడు ఏం ఎరగనట్లు ఆ కేసులు తప్పు అంటూ మాట్లాడుతోంది.ఏపీలో టీడీపీకి కొత్త మిత్రుడు రఘువీరారెడ్డి అయితే ఇది కక్ష సాధింపే అంటున్నారు. మొత్తానికి బాబ్లీ.. బాబు ఉచ్చులో పడి ఏపీ రాజకీయాలు సలసల మరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: