ఉద్యోగ సంఘాలు చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డుతున్నాయి.  చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా ఉద్యోగుల త‌మ  స‌మ‌స్య‌ల కోసం రోడ్డెక్క‌క త‌ప్ప‌టం లేదు. ఇపుడు కూడా అదే జ‌రిగింది. కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సిపిఎస్)ను వెంటనే ర‌ద్దు చేసి పాత పెన్ష‌న్ విధానాన్నే కొన‌సాగించాల‌నే డిమాండ్ తో ఈరోజు ఉద్యోగ‌, ఉపాధ్యాయ జేఏసి ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తిలోని అసెంబ్లీ ముట్టడి కార్య‌క్ర‌మంలో ఉద్రిక్త‌త తలెత్తింది. 


ఎటూ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి అసెంబ్లీ ముట్ట‌డికి జేఏసి పిలుపిచ్చింది. అందుక‌నే 13 జిల్లాల నుండి ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల్లోని వేలాదిమంది స‌భ్యులు ఈరోజు ఉదయానికే విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. అయితే, ఉద‌యం నుండే విజ‌య‌వాడ శివారు ప్రాంతాల్లోనే పోలీసులు బ‌స్సుల‌ను నిలిపేస్తు త‌నిఖీ చేయ‌టం మొద‌లుపెట్టారు. ఎక్క‌డ ఉద్యోగ, ఉపాధ్యాయులు క‌నిపించినా వెంటనే వారిని దింపేసి అదుపులోకి తీసుకుంటున్నారు. 


నిజానికి ఈ ప‌థ‌కం కేంద్రం ప‌రిధిలోనిదే అయినా రాష్ట్రాల ఆమోదం లేనిదే అమ‌లు సాధ్యం కాదు. రాష్ట్రాలు గ‌నుక ప‌థ‌కం అమ‌లుకు వ్య‌తిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తే ప‌థ‌కం అమ‌లు ఆగిపోతుంది. ఆ విష‌యంపైనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు చంద్ర‌బాబును ఎన్నిసార్లు క‌లిసి విజ్ఞ‌ప్తి చేసినా ఉప‌యోగం క‌న‌బ‌డ‌లేదు. సిపిఎస్ అమ‌లు వ‌ల్ల సుమారు ల‌క్షమంది ఉద్యోగ‌, ఉపాధ్యాయులు న‌ష్ట‌పోతారని స‌మాచారం.  


ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఉద్యోగ‌, ఉపాధ్యాయుల ఆందోళ‌న చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టేదన‌టంలో సందేహం లేదు. ప్ర‌తీ విష‌యాన్ని రాజ‌కీయ కోణంలోనే చూడ‌టం చంద్ర‌బాబుకు బాగా అల‌వాటు. అందుక‌నే ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాలు చంద్ర‌బాబుపై మండిపోతున్నారు.  చంద్ర‌బాబు వైఖ‌రి చూస్తుంటే ఎటూ ఉద్యోగులు టిడిపికి వ్య‌తిరేకంగానే ఓట్లేస్తారు కాబ‌ట్టి సిపిఎస్ ర‌ద్దుకు ఎందుకు ప్ర‌య‌త్నించాల‌న్న‌ట్లుంది. మ‌రి, ఉద్యోగులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: