దేశంలో జాతీయ పార్టీలు పేరుకు మాత్రమే. చాలా చోట్ల వాటికి ఉనికే లేదు కూడా. ఈ రోజు దేశాన్ని ఏలుతున్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అస్తిత్వం లేదు. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కి ఏపీలో ఉనికే లేదు. తెలంగాణాలో బతుకు పోరాటం  దానిది. ఈ నేపధ్యంలో అక్కడా ఇక్కడా బలంగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. మరిపుడు నేనున్నానంటూ కాంగ్రెస్  ముందుకు వస్తే ఆదరించాలా..మాకే ఓటు వేయండని బీజేపీ కోరితే మెత్తబడాలా..


దెబ్బ తీశారుగా :


ఉమ్మడి ఏపీని అడ్డంగా విడగొట్టి కాంగ్రెస్ అంధ్రుల మనోభావాలతో చెడుగుడు ఆడుకుంది. ఆ పార్టీ సరైన విధానం లేకుండా చేసిన విభజన ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. పోనీ విభజన హామీలైనా ఓ పధ్ధతిగా పెట్టారా అంటే అదీ లేదు. 18 అంశాలతో హామీలు ఇచ్చాం అన్నారు. వేటికీ చట్టబద్దత లేనే లేదు. ప్రత్యేక హోదా కూడా అలాంటి అంశమే. దాంతోనే చిక్కు వచ్చిపడింది. 


వీళ్ళూ  అంతే:


ఇక కాంగ్రెస్ జమానా ముగిసి కేంద్రంలో బీజేపీ వచ్చింది. తామూ ఆ తానులో ముక్కలమేనని బీజేపీ కూడా నిరూపించుకుంది. ప్రత్యేక హోదాను అటకెక్కించేసింది. మిగిలిన హామీలకూ అతీ గతీ లేదు. ఎంతో చేశామని చెప్పుకుంది. నిన్నటి వరకూ ఆ పార్టీలో అంటకాగిన టీడీపీ సైతం బీజేపీకి చెక్క భజన చేయడంతో ఏపీ జనాలు దారుణంగా నష్టపోయారు.


మళ్ళీ బిస్కట్లు :


ఇపుడు మరో మారు కాంగ్రెస్ రంగంలోకి వచ్చింది. వాళ్ళు మోసం చేశారు. నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. అధికారంలోకి వస్తే హోదా ఇచ్చేస్తామంటూ బిస్కట్లు వేస్తున్నారు. నిజానికి ఎటువంటి శాస్త్రియ విధానం లేకుండా ఏపీని రెండు ముక్కలు చేసిందే కాంగ్రెస్. ఇపుడు పాత గాయాలు ఇంకా మానలేదు కానీ మళ్ళీ అమాయకపు ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ల వేటకు రెడీ అయిపోతోంది. ఏపీపై అంత ప్రేమ ఉంటే విభజన హామీలన్నీ చట్టంలో పెట్టవచ్చు కదా.  తాము ఉన్నపుడే బిల్లు చేసి గట్టిగా అమలు అయ్యేలా చూడొచ్చుగా.


నమ్మేద్దామా  :


ఇలా దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా నవ్యాంధ్ర రెండు జాతీయ పార్టీల చేతిలో వరసగా కేవలం అయిదేళ్ళ కాలంలోనే మోసపోయింది. ఈ పరిస్తితుల్లో మళ్ళీ జాతీయ పార్టీలను నమ్మొద్దంటూ పెద్ద ఎత్తున నెట్ జన్లు కామెంట్స్ పెడుతున్నారు. జరిగింది చాలు, ఏపీలో మరో మారు జాతీయ పార్టీలకు అడుగు పెట్టే చాన్స్ ఇవ్వొద్దని అంటున్నారు. జాతీయాపార్టీల ఉనికే లేని తమిళ్ నాడు, బెంగాల్, బీహార్, మొన్నటి వరకూ యూపీ వంటి రాష్ట్రాలు హ్యాపీగా బతకలేదా అంటూ లాజిక్ పాయింట్లు తీస్తున్నారు.



 ఏపీలో ప్రజలు  తమకు నచ్చిన ప్రాంతీయ పార్టీలకే ఓటు వేసి జాతీయ పార్టీలకు నో ఎంట్రీ బోర్డ్ చూపించాలని కోరుతున్నారు. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా జనం ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో గళం విప్పాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఇదే ఆవేశం బాగా పెరిగితే ఏపీలో రెండు జాతీయ పార్టీలకూ మంచి నీళ్ళు పుట్టవన్నది నిజమే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: