ప్రత్యేక హోదా ఎంత పుణ్యం చేసుకుందో కానీ అన్నీ ఉండి అనాధగా మారిపోయింది. నాటి యూపియే బ్రైన్ చైల్డ్ అయిన హోదా అయిదేళ్ళ కాలంలో ఎంతో మంది రాజకీయ తండ్రులను చూసింది. తమ అవసరాలకు  చేరదీయడమే తప్ప అండగా నిలబడే నాధుడు లేక హోదా విషాద గాధ అయింది. చిత్రమేమిటంటే  ఎవరైతే  వంచించారో  వారికే మరోమారు రాజకీయ పబ్బంగా  హోదా మారిపోవడం రాజకీయ విక్రుత క్రీడలో భాగమేనేమో.\


ఆ నోటితోనే :


ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయి. అంతకంటే ఎక్కువ నిధులు తెచ్చాం. అభివ్రుధ్ధి చేస్తున్నామంటూ నాలుగేళ్ళుగా అసెంబ్లీలో  ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభువులు అదే నిండు సభలో హోదా ఎందుకివ్వరంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నట్లు డ్రామాలు ఆడుతూంటే హోదాకు పట్టిన దుర్గతి ఏంటో  ఇట్టే అర్ధమైపోదా. తెలుగు జాతి ఊరుకోదు, హోదా ఇవ్వకపోతే  బొబ్బిలి పులిలా తిరగబడుతుంది, బ్రిటిష్ పాలనలో ఉన్నామా, బానిసలమనుకుంటున్నారా. ఇదీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారు హోదాపై అసెంబ్లీలో ఓ రేంజిలో దంచిన  స్పీచ్.


నమ్ముతున్నారా :


నాలుగేళ్ళుగా హోదా రాకపోవడానికి టీడీపీ, బేజేపీ కారణమని తెలుసు. వాళ్ళ నోటితోనే అనేక సార్లు ఈ రెండు పార్టీలనూ దారుణంగా విమర్శించారు. కానీ ఎన్నికల  టైం అయిందనో, మరే ఇతర‌ సమీకరణలు పనిచేస్తున్నాయో తెలియదు కానీ ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట హడావుడి చేసిన చలసాని శ్రీనివాస్ బాబుని కలసి మరీ అసెంబ్లీలో హోదా తీర్మానాన్ని  పెట్టమని కోరారు. అంటే ఇన్నాళ్ళు తాము టీడీపీని తిట్టింది అబద్దమనుకోవాలా లేక బాబు వల్లనే హోదా వస్తుందని నమ్ముతున్నారా.


ఆయనకే  హక్కులన్నీ :


ఏపీలో రాజకీయం చేష్టలుడిగిపోయింది. హోదాపై ఎన్నో పోరాటాలు చేసిన వామపక్షాలు ఉలుకూ పలుకూ లేదు. హోదా కావాలని యువ భేరీలు లాంటి అనేక మీటింగులు పెట్టిన వైసీపీ  ఇపుడేం చేస్తోందో తెలియదు, హోదాపై  జనంలోని వచ్చి మొదటి సారి గర్జించిన జనసేనాని పవన్ సైతం మౌన ముద్రలో ఉన్నారు. సాధన సమితులు, ప్రజా సంఘాలూ అన్నీ కలసి హోదా హక్కులన్నీ మెల్లగా బాబుకే దఖలు పరుస్తున్న సీన్ ఇపుడు రక్తి కట్టేలా సాగుతోంది.


వారెవ్వా ఎంత బాగుంది ఈ రాజకీయం.. హోదా అంటే జైల్ అన్న ప్రభుత్వం ఇపుడు హోదా కోసం డిమాండ్ అంటోంది. అదే  బాగుందంటూ పోరాట యోధులంతా చప్పట్లు కొడుతున్నారు. మరో మారు హోదా పేరు చెప్పి టీడీపీ ఓట్లు దండుకునే ప్రోగ్రాం కి ఏపీ రాజకీయం పూర్తిగా సహకరిస్తోంది. ఇంతకీ హోదా వస్తుందా.. ఆ ఒక్కటీ అడగొద్దు..


మరింత సమాచారం తెలుసుకోండి: