తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి మొద‌లైంది. ఆ లొల్లి మొద‌లుపెట్టింది కూడా సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపి విహెచ్  హ‌నుమంత‌రావు కావ‌టం గ‌మ‌నార్హం. ఈరోజు ఢిల్లీ నుండి పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు వ‌చ్చి క‌లిశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అధిష్టానం తాజాగా నియ‌మించిన మూడు క‌మిటీల‌పై సీనియ‌ర్ల‌లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అదే విష‌యాన్ని చాలామంది ఆజాద్ దృష్టికి తీసుకెళ్ళారు. 


త‌ర్వాత మీడియాతో విహెచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కెసిఆర్ కోవ‌ర్టులున్న‌ట్లు పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్ నేత‌ల్లో ప‌లువురు కెసిఆర్ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారంటూ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లే చేశారు. విహెచ్ తాజా ఆరోప‌ణ‌ల‌తో పార్టీ నేత‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌చార క‌మిటీ బాధ్య‌త‌ల నుండి  విహెచ్ ను అధిష్టానం దూరంగా పెట్టింది. అందుకే విహెచ్ ఇపుడు మండిపోతున్నారు. 


ప్ర‌చార క‌మిటీలో త‌న‌ను స‌భ్యునిగా నియ‌మించ‌టం క‌న్నా చంచ‌ల్ గూడ జైల్లో పెడితే బాగుండేద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణా అంతా తిరిగి పార్టీకి ప్ర‌చారం చేసే నిమ్మితం  ప్ర‌త్యేక వాహ‌నాన్ని కూడా రెడీ చేసుకున్న‌ట్లు విహెచ్ చెబుతున్నారు. త‌న‌కు బాధ్య‌త‌లు ఇవ్వ‌క‌పోయినా తానైతే ఇంట్లో ఊరికే కూర్చునే ర‌కం కాద‌ని అధిష్టానానికి హెచ్చ‌రిక‌లు పంప‌ట‌మే ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  కెసిఆర్ తో లోపాయికారి ఒప్పందాల‌ను చేసుకున్న వారెవ‌రో త్వ‌ర‌లోనే చెబుతాన‌న్న విహెచ్ తాజా వ్యాఖ్య‌ల‌తో పార్టీలో క‌ల‌కలం మొద‌లైంది. మొత్తానికి విహెచ్ వేసిన బాంబు ఎప్పుడు ఏ ర‌కంగా పేలుతుందో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. ఇదిలా వుండ‌గా విహోచ్ తో పాటు క‌మిటీల కూర్పుపై మాజీ మంత్రి డికె అరుణ‌, మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి తదితరులు కూడా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: