అంద‌రిలోను ఇపుడిదే అనుమానం పెరిగిపోతోంది.  ఎందుకంటే, చంద్ర‌బాబు అవినీతి గురించి ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా, ఆరోప‌ణ‌లు చేసినా కేంద్ర‌ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేదు ? అన్న అనుమాన‌మే అంద‌రినీ ప‌ట్టి పీడిస్తోంది. పైకి మాత్రం కేంద్రం-చంద్ర‌బాబు మ‌ధ్య సినిమా త‌ర‌హా ఫైటింగ్ జ‌రుగుతోంద‌న్న‌దే ప‌లువురి అనుమానం. గ‌డచిన నాలుగున్న‌రేళ్ళ‌లో రాష్ట్రంలో విప‌రీత‌మైన అవినీతి జ‌రిగింద‌న్న‌ది వాస్త‌వం. అన్నీ వ్య‌వ‌స్ధ‌ల‌ను చంద్ర‌బాబు నిర్వీర్యం చేసేశారు. దాంతో ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త పెరిగిపోయింది.


స‌రే, నాలుగేళ్ళపాటు చంద్ర‌బాబుతో క‌లిసి కాపురం చేసిన బిజెపి నేత‌లు ఇపుడు మాత్రం అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. క‌లిసి కాపురం చేసిన‌పుడు మాట్లాడ‌కూడ‌ద‌నే అప్ప‌ట్లో తాము మౌనంగా ఉన్న‌ట్లు బిజెపి నేత‌లు ఇపుడు సిగ్గులేకుండా చెప్పుకుంటున్న విష‌యం  అంద‌రూ చూస్తున్న‌దే.  ఎప్పుడైతే చంద్ర‌బాబుతో విడిపోయారో  అప్ప‌టి నుండి బిజెపి నేత‌లు ఆరోప‌ణ‌ల‌తో రెచ్చిపోతున్నారు. రాజ‌కీయ‌ల‌న్నాక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు మామూలే. కానీ ఇక్క‌డ తాము చేస్తున్న ఆరోప‌ణ‌లకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు బిజెపి నేత‌లు.


త‌మ ఆరోప‌ణ‌కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే కేంద్రంలోని ప‌లు మంత్రిత్వ శాఖ‌ల‌కు ఆధారాల‌తో కూడిన‌ ఫిర్యాదులు  చేసిన‌ట్లు వారే చెబుతున్నారు.  చంద్ర‌బాబు పై ప్ర‌ధానంగా ఎంఎల్సీ సోము వీర్రాజు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు రెచ్చిపోతున్నారు. వీరు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో కాస్త లాజిక్ కూడా ఉంటోంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి క‌ద‌లిక క‌నిపించ‌లేదు. 


స‌రే, వీరి ఆరోప‌ణ‌ల‌ను ప‌క్క‌న‌బెడ‌దాం. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని స్వ‌యంగా కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట్ జ‌న‌ర‌ల్ (కాగ్)  కూడా నిర్ధారించింది క‌దా ?  కాగ్ అంటే రాజ్యాంగ‌బ‌ద్ద సంస్ధే. అటువంటి సంస్ధే ప‌ట్టిసీమ‌లో రూ. 400 కోట్లు, తాత్కాలిక సచివాల‌యంలో రూ. 40 కోట్లు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు రూ. 2 వేల కోట్లు అవినీతి జ‌రిగింద‌ని గుర్తించింది.  58 వేల పిడి ఖాతాల్లో రూ. 52 వేల కోట్ల‌ను దారిమ‌ళ్ళించారని కూడా ఇదే కాగ్ స్ప‌ష్టంగా చెప్పింది. ప్ర‌తీ ప‌థ‌కం అమ‌లులోనూ భారీ ఎత్తున  అవినీతి జ‌రిగింద‌ని బిజెపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు అంద‌రూ చూస్తున్న‌దే.


కాగ్ నిర్ధారించిన అవినీతంతా  కేంద్ర‌ప్ర‌భుత్వ నిధుల‌తో న‌డుస్తున్న ప్రాజెక్టులే. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల్లో కూడా ఎక్కువ భాగం కేంద్రం వాటానే ఉంది. మ‌రి అవినీతి ఇంత స్ప‌ష్టంగా కంటికి క‌నిపిస్తున్నా, కాగ్ నిర్ధారించినా విచార‌ణ జ‌రిపించే దిశ‌గా కేంద్రం నుండి ఎటువంటి క‌ద‌లికా ఎందుకు క‌నిపించ‌టం లేదు ? ఈ పాయింట్ లోనే అంద‌రికి చంద్ర‌బాబు-మోడి బందంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.  పైకి ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా అవస‌ర‌మైన‌పుడు మ‌ళ్ళీ ఇద్ద‌రూ క‌లిసిపోయే ఒప్పందంతోనే విడిపోయారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏమో రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు చెప్ప‌లేం.


మరింత సమాచారం తెలుసుకోండి: