తెలంగాణా రాష్ట్ర స‌మితిలో తిరుగుబాటు నేత కొండా సురేఖ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని మూడు స్దానాల్లో రెండింటిలో తాము పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టించారు. ఇద్ద‌రిని టార్టెట్ చేశామ‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి సంగ‌తేంటో చూస్తామ‌న్న‌ట్లుగా చాలెంజ్ చేశారు. రాబోయ ఎన్నిక‌ల్లో జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, వరంగల్ తూర్పు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండింటిలో క‌చ్చితంగా పోటీ చేస్తామ‌న్నారు. ఎవ‌రెక్క‌డ పోటీ చేసేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామని సురేఖ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. 


అదే సంద‌ర్భంలో కెసిఆర్ పై పెద్ద ఎత్తున ధ్వ‌జ‌మెత్తారు. కెసిఆర్ ది అంతా దొర‌ల పాల‌నంటూ మండిప‌డ్డారు. ఫాం హౌస్ లో కూర్చుని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టాల‌ని చూస్తుంటార‌న్నారు. 105 మందికి టిక్కెట్లు ప్ర‌క‌టించిన  కెసిఆర్ త‌మ‌కు ఎందుకు ప్ర‌క‌టించ‌లేదో  చెప్పాల్సిన బాధ్య‌త కెసిఆర్ పై ఉంద‌న్నారు. అదే విష‌యంలో తాము లేఖ రాసినా  కెసిఆర్ నుండి స‌మాధానం రాలేద‌న్నారు. త‌మ లేఖ‌కు స‌మాధానం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం కూడా పోయింద‌న్నారు. అందుక‌నే తాము వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో ప్ర‌క‌ట‌న చేయాల్సొచ్చింద‌న్నారు. 


కొండా దంప‌తుల తాజా  నిర్ణ‌యంతో వ‌రంగ‌ల్ జిల్లాలో టిఆర్ఎస్ అభ్య‌ర్ధుల గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌న‌టంలో సందేహం లేదు. క్షేత్ర‌స్ధాయిలో మంచి బ‌ల‌మున్న కొండా దంప‌తుల‌ను వ‌దులు కోవ‌టం కెసిఆర్ కు పెద్ద న‌ష్ట‌మే జ‌రుగుతంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  రాబోయే ఎన్నిక‌ల్లో తాము టార్గెట్ చేసిన వారి పేర్ల‌ను చెప్ప‌టానికి మాత్రం సురేఖ చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కాస్త ఓపిక‌ప‌ట్టండి అన్నీ విష‌యాలు తెలుస్తాయంటూ విష‌యాన్ని దాటేయ‌టం గ‌మ‌నార్హం. జిల్లాలోని య‌ర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు సురేఖ దంప‌తుల‌కు ఏమాత్రం ప‌డ‌ద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. మొత్తానికి జిల్లాలో కెసిఆర్ పై కొండా దంప‌తులు పెద్ద తిరుగుబాటు లేవ‌దీసిన‌ట్లే క‌న‌బ‌డుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: