చివ‌ర‌కు తెలంగాణాలోని సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన టిడిపి బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌రిస్ధితి ఇలా త‌యారైంది. ఎవ‌రినో నమ్ముకుని ఏదో చేస్తే అది కాస్త ఇంకేదో అయ్యింద‌న్న‌ట్లు త‌యారైంది మోత్కుప‌ల్లి వ్య‌వ‌హారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజ‌వర్గం నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా పోటీ  చేస్తున్నారు. ఆ విష‌యాన్ని ఈరోజు మీడియా స‌మావేశం పెట్టి ఆయ‌నే ప్ర‌క‌టించారు. 


తెలంగాణా రాష్ట్ర స‌మితి, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను న‌మ్ముకుని టిడిపిలో చిచ్చుపెట్టారు. త‌న‌కు బ‌ద్ధ శ‌తృవైన రేవంత్ రెడ్డి ఆధిప‌త్యాన్ని స‌హించ‌లేక పార్టీలో గొడ‌వ‌లు మొద‌లుపెట్టారు. రేవంత్ కు చంద్ర‌బాబు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త ఇస్తుండ‌టాన్ని కూడా స‌హించ‌లేక‌పోయారు. చంద్ర‌బాబు-రేవంత్ బంధం ఎంత గ‌ట్టిదో తెలిసి కూడా ఇద్ద‌రిపైన మండిపోయారు. దానికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలంటూ ఒక‌టే ఊద‌ర‌గొట్టారు. త‌న ప్ర‌తిపాద‌న‌ను  వ్య‌తిరేకించినందుకు రేవంత్ పై తిట్ట‌ని తిట్టులేదు.


టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ప‌దే ప‌దే బ‌హిరంగంగానే ప్ర‌తిపాద‌న‌లు పంపారు. అయినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. దాంతో  చంద్ర‌బాబును కూడా నోటికొచ్చిన‌ట్లు తిట్ట‌టం మొద‌లుపెట్ట‌టంతో  చేసేదిలేక తెలుగుదేశంపార్టీ నుండి బ‌హిష్క‌రించారు. త‌ర్వాత మ‌రింత రెచ్చిపోయి ఏపిలో కూడా ప‌ర్య‌టించి చంద్ర‌బాబుకు పెట్టిన శాప‌నార్ధాలు అంద‌రికీ తెలిసిందే. ఇదంతా ఎందుకు  చేశారంటే కెసిఆర్ ప్రాప‌కం కోస‌మే అని ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అయితే టిడిపి నుండి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన త‌ర్వాత కెసిఆర్ కూడా మోత్కుప‌ల్లిని ప‌ట్టించుకోవ‌టం మానేశారు. దాంతో కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. చివ‌ర‌కు ఎవ‌రూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని అర్ధ‌మైన త‌ర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఎంతో సీనియ‌ర్ అని చెప్పుకునే మోత్కుప‌ల్లికి చివ‌ర‌కు ఎంత గ‌తి ప‌ట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: