రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధుల విష‌యంలో అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ఫార్ములాపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. బేసిక‌ల్ గా ప‌వ‌న్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా అంద‌రికీ తెలిసిందే. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో ఉన్న కొద్దిమంది నేత‌ల్లో కూడా ఎక్కువ‌మంది కాపులే చేరారు.  ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన నేతలు చాలా త‌క్కువ మందే ఉన్నారు. ఓ పార్టీ జ‌నాల్లోకి చొచ్చుకుపోవాల‌న్నా, అధికారంలోకి రావాల‌న్నా అన్నీ  సామాజిక‌వ‌ర్గాలు ఆధ‌రిస్తేనే సాధ్య‌మ‌న్న విష‌యంలో రెండో ఆలోచ‌న అవ‌స‌రం లేదు. ఆ ముద్ర ప‌డ‌కూడ‌ద‌నే ప‌వ‌న్ తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.


2009 ఎన్నిక‌ల్లో  చిరంజీవి  ప్ర‌జా రాజ్యం పార్టీని పెట్టారు. అప్పుడు పిఆర్పీ కేవ‌లం కాపుల కోసం పెట్టిన పార్టీగా ముద్ర‌ప‌డిపోయింది. దానికి త‌గ్గ‌ట్లే పార్టీపై చిరంజీవి సోద‌రులు నాగుబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బావ అల్లు అర‌వింద్ తదిత‌రుల పెత్త‌నం పెరిగిపోయింది. సీట్ల కేటాయింపులో కూడా కాపుల‌కే ప్రాధాన్య‌త ఇచ్చారు. అదే స‌మ‌యంలో కేటాయించిన సీట్ల‌పైన కూడా అనేక ఆరోప‌ణ‌లు ముసురుకున్నాయి. ఫ‌లితంగా చాలా సామాజిక‌వ‌ర్గాలు పిఆర్పీకి దూర‌మ‌య్యాయి.  చిరంజీవి కుటుంబ‌స‌భ్యుల వైఖ‌రితో విసిగిపోయిన కాపుల్లో కూడా  చాలామంది పిఆర్పికి  ఓట్లు వేయ‌లేదు. ఫ‌లితంగా పిఆర్పీ ఏర్పాటు ఓ విఫ‌ల ప్ర‌యోగంగా నిలిచిపోయింది.


అప్ప‌డు పిఆర్పిలో ప‌వ‌న్ కూడా కీల‌క పాత్రే పోషించార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సోద‌రుని వైఫ‌ల్యం ద‌గ్గ‌ర నుండి చూశారు. అందుకే త‌న సార‌ధ్యంలోని జ‌న‌సేన అలా కాకూడ‌ద‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. కాబ‌ట్టే సీట్ల కేటాయింపులో అన్నీ సామాజిక‌వ‌ర్గాల స‌మ‌తూకం ఉండేట్లుగా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం.  ఆ దిశ‌గానే క‌స‌ర‌త్తు కూడా మొద‌లైంద‌ట‌. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నాభా (ఓట‌ర్లు) ప‌రంగా ఏ సామాజిక‌వ‌ర్గాల ఓట్లు ఎంతున్నాయి అనే విష‌యంలో వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ని స‌మాచారం.


ఇక‌, కాపుల‌కు కేటాయించే సీట్ల విష‌యం కూడా ప్ర‌ధాన‌మైన అంశ‌మే. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో  సుమారు 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ఇందులో కూడా  కాపు సామాజిక‌వ‌ర్గాల ఓట్లు అత్య‌ధికంగా ఉన్న స్ధానాలు  సుమారు 35 వ‌ర‌కుంటాయి. ఇక్క‌డే ప‌వ‌న్ పెద్ద వ్యూహంతో ఉన్నారు. కాపుల ఓట్లు జ‌న‌సేన‌కు ఎటూ ప‌డ‌తాయన్న అంచ‌నాతో ఉన్న ప‌వన్ కాపులెక్కువున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నాన్ కాపుల‌ను నిల‌బెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. 


అంటే, కాపు నియోజ‌క‌వ‌ర్గాల్లో  ఓట్ల ప‌రంగా కాపుల త‌ర్వాత ఎక్కువున్న సామాజిక‌వ‌ర్గాల్లోని గ‌ట్టి నేత‌ల‌ను రంగంలోకి దింపాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. దాని వ‌ల్ల కాపుల ఓట్లూ ప‌డ‌తాయి, పోటీ చేస్తున్న అభ్య‌ర్ధి సామాజిక‌వ‌ర్గం ఓట్లు ప‌డ‌తాయ‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. అటువంటి వ్యూహాల వ‌ల్ల స‌మాజంలోని అన్ని సామాజిక‌వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ వ్యూహాలు ఏ మేరకు వ‌ర్క‌వుట‌వుతుందో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: