గాంధీ మరణించి డెబ్బై ఏళ్ళు కావస్తోంది. ఆయన పుట్టిన రోజులు, వర్ధంతులు జరుపుకుంటున్నాం. కానీ ఆయన అశయాలను బతికిస్తున్నామా అన్న ప్రశ్న వచ్చినపుడు లేదనే సమాధానమే వస్తుంది. గాంధీ జాతి పితగా, ప్రపంచం మెచ్చిన అహింసావాదిగా ఉన్నారు. తన జీవిత పర్యంతం దేశం కోసం పని చేశారు. తాను పుట్టిన గడ్డ సమానత్వంతో, సౌభాగ్యంతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.


హింసతోనే అంతా :


గాంధీ ఏ హింసనైతే వద్దనుకున్నాడే అదే హింసను ప్రేరేపించి ఆయన్ని బలిగొన్నాము. తూటా దెబ్బకు అహింసామూర్తి అసువులు బాసారు. ఈ దేశంలో పేదలు ఉండరాదని, అందరూ ఒక్కటిగా బతకాలని గాంధీ కోరుకున్నారు. మరి చూస్తే పేదలు మరింత పేదలు అయిపోయారు. అసమానతలు అలా పెరిగిపోయాయి. బడుగులు, బలహీనులు ఇంకా క్రింగిపోతూనే ఉన్నారు. 


మహిళల సంగతి :


ఇక మహిళల గురించి గాంధీ ఓ మాట అన్నారు. అర్ధరాత్రి ఆడది వంటరిగా తిరిగే స్వేచ్చ ఎపుడైతే వస్తుందో అపుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని. మరి ఆ రోజు వచ్చిందా. లేదు సరి కదా పట్టపగలే ఆరాచకం రాజ్యమేలుతోంది. మహిళలపై దాడులు దారుణంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లలను సైతం వేధింపులకు  గురిచేస్తున్న భారతం కళ్ళ ముందు ఉంది.


ఇక ఇంతేనా :


మహనీయులు కోరుకునేది తాము జీవితాంతం కట్టుబడిన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళమని. తాము కలలు కన్న వాటిని నెరవేర్చమని. కానీ పరిస్తితి చూస్తే అలా లేదు. ఇంకా దిగజారిపోతోంది. జయంతులు, వర్ధంతులు చేసేసి ఆ మీదట ఎవరి పని వారు చేసుకుంటూపోతున్నారు. పొటోలకు దండలు వేయడం తప్ప మహత్ముల నుంచి గ్రహించింది ఏమీ లేదు. అటువంటి దేశాన్ని, ఈనాటి తరాన్ని చూసిన బాపు లాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడే పుట్టాలనుకుంటారా. ఇపుడు ఈ దేశాన్ని నా దేశం అని అనుకోగలరా.


మరింత సమాచారం తెలుసుకోండి: