దాదాపు 43 గంట‌ల పాటు సాగిన ఆదాయ‌పు ప‌న్ను, ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల త‌నిఖీలు ఈరోజు తెల్ల‌వారుజామున ముగిసింది.  ఇన్ని గంట‌ల పాటు త‌నిఖీలు చేసిన ఘ‌ట‌న ఏ ఈమ‌ధ్య లేదేమో. రెండు రోజుల పాటు జ‌రిగిన త‌నిఖీలో  ప‌లు కీల‌క ప‌త్రాలు, డాక్యుమెంట్ల‌, సిడిలు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి నేప‌ధ్యంలో రేవంత్ ఇంటిపై జ‌రిగిన దాడులు నిజంగా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా మొత్తం తెలంగాణాలోనే సంచ‌ల‌నం సృష్టించింద‌నే చెప్పాలి. 


అస‌లే, టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్  రేవంత్ ను టార్గెట్ చేసుకున్నార‌న్న విష‌యం అందిరికీ తెలిసిందే.  దానికి త‌గ్గ‌ట్లే పావులు క‌దుపుతున్నారు. అందులో భాగ‌మే ఎప్పటిదో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో అవ‌క‌త‌వ‌క‌ల కేసుకు ఇపుడు దుమ్ము దులిపారు. దానికితోడు ఎటూ ఓటుకు నోటు కేసు ఉండ‌నే ఉంది. ఇపుడు జ‌రిగిన దాడులు పై రెండు కేసుల్లో దేనికి సంబంధించిందో చాలా మందికి  క్లారిటీ లేదు. కాక‌పోతే ఓటుకునోటు కేసులోనే రేవంత్ విచార‌ణ జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 


రేవంత్ తో పాటు అత‌డి త‌మ్ముడు, మ‌ర‌ద‌లు, భార్య త‌దిత‌రుల‌ను కూడా గంట‌ల త‌ర‌బడి విచారించారు. రేవంత్ భార్య‌ను తీసుకుని అనేక బ్యాంకుల‌కు కూడా అధికారులు వెళ్ళిన‌ట్లు స‌మాచారం. వివిధ బ్యాంకుల్లోని లాక‌ర్ల‌ను తెరిపించి డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నార‌ట‌. అందులోనే ప‌లు ఆడియో టేపులు కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఆ ఆడియో టేపుల్లో ఏముందో తెలియాలి.  కంప్యూట‌ర్లు, హ‌ర్డ్ డిస్క్ లు కూడా తీసుకెళ్ళార‌ట‌. గురువారం తెల్ల‌వారి మొద‌లైన సోదాలు శ‌నివారం ఉద‌యం 3 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. వెళ్ళేముందు 150 ప్ర‌శ్న‌ల‌కు రేవంత్ , భ‌ర్య నుండి లిఖిత పూర్వ‌క స‌మాధానాలు తీసుకున్నార‌ని, కొన్ని ప‌త్రాల‌పై ఇద్ద‌రి సంత‌కాలు తీసుకున్నార‌ని స‌మాచారం. మ‌రి ఆ ప్ర‌శ్నలేంటో, ఏ ప‌త్రాల‌పై సంత‌కాలు తీసుకున్నారో  రేవంతే చెప్పాలి. వ‌చ్చే నెల 3వ తేదీన ఐటి కార్యాల‌యంలో జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటు ఓ నోటీసును రేవంత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: