మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి గుట్టంతా ఓ హార్డ్ డిస్కులో ఉందంటూ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇంతకీ హార్డ్ డిస్క్ ఏంటి ? ఏమాకథ ? అది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవల్సిందే. తెలంగాణా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల పాటు ఐటి అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. 33 గంటల పాటు రేవంత్ తో పాటు ఆయన భార్యను కూడా విచారించారు. సోదాలైనా, విచారణైనా ఓటుకునోటు కేసు కేంద్రంగానే జరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆ కేసులో ఓసారి జైలుకు కూడా వెళ్లి వచ్చిన రేవంత్ ను తాజాగా అదే కేసులో విచారించటమంటే చిన్న విషయం కాదు. అందులోనూ తెలంగాణాలో ముందస్తు ఎన్నికల వేడి నేపధ్యంలో.


రేవంత్ విచారణలో భాగంగా  ఆ కేసులో సంబంధమున్న ఉదయసింహ, సెబాస్టియన్, రణధీర్ రెడ్డి తదితరులకు కూడా ఐటి విచారణ చేస్తోంది. అందులో  భాగంగానే రణధీర్ ఇంట్లో రెండు రోజుల క్రితం ఐటి అధికారులు సోదాలు చేశారు. నగలు, డబ్బు, కంప్యూటర్లు,  హార్డ్ డిస్క్, డాక్యుమెంట్లు అన్నింటినీ తీసుకెళ్ళినట్లు సమాచారం. మిగిలిన విషయాలు ఎలాగున్న హార్డ్ డిస్కు విషయమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే,  ఆ హార్డ్ డిస్క్ రణధీర్ ది కాదట. దొరికిన హార్డ్ డిస్క్ కూడా ఓ సీల్డ్ కవర్లో కనిపించిందట. దాంతో ఐటి అధికారులు ఆ హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

తనది కాని హార్డ్ డిస్క్ రణధీర్  దగ్గరకు ఎలా వచ్చింది ? ఎలాగంటే, రణధీర్ కు ఉదయసింహ బంధువన్న విషయం తెలిసిందే. ఆ ఉదయసింహానే రణధీర్ కు హార్డ్ డిస్క్ ను ఇచ్చారట. ఆమధ్య ఉదయసింహ ఇల్లు మారేటపుడు రణధీర్ కు  హర్డ్ డిస్క్ ను,  ఓ బ్యాంకు లాకర్ కీని ఇచ్చి దాచిపెట్టమని ఇచ్చారట. ఉదయసింహ చెప్పినట్లుగానే తాను హార్డ్ డిస్క్ ను దాచిపెట్టానని, అందులో ఏముందో కూడా తనకు తెలీదని రణధీర్ అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఉదయసింహ సన్నిహితుడే కాకుండా ఓటుకునోటు కేసులో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.


కాబట్టే రణధీర్ కు ఉదయసింహ ఇచ్చిన హార్డ్ డిస్క్  లో రేవంత్ కు సంబంధించిన విషయం ఏదో ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఇక్కట ట్విస్టు ఏమిటంటే రణధీర్ ఇంటిపై దాడులు చేసి సోదాలు చేసింది అందరూ అనుకుంటున్నట్లు ఐటి అధికారులు కాదని టాస్క్ ఫోర్సు పోలీసులని రణధీర్ చెప్పటం కొసమెరుపు.  మరి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటిపై దాడి చేయటం సోదాలు జరపటం, రణధీర్ ను ఎత్తుకెళ్ళటం చూస్తుంటే హార్డ్ డిస్క్ కోసం తెరవెనుక ఏదో గందరగోళం జరుగుతోందని అనుమానం బలపడుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: