ముందస్తు ఎన్నికల హీట్ ను పెంచేసిన ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసియార్ కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కెసియార్ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కూడా కెసియార్ ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. అటువంటిది రానున్న ఎన్నికలకు ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తు,  మరోవైపు అసంతృప్తులను బుజ్జగిస్తున్న సమయంలో సొంత నియోజకవర్గంలోని నేతలే ముఖ్యమంత్రికి పెద్ద షాక్ ఇచ్చారు.

 ఇంతకీ విషయం ఏమిటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్యులు, వారి అనుచరులు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగదేవ్ పూర్ ఎంపిపి రేణుకతో పాటు ఇద్దరు ఎంపిటిసిలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. రేణుకతో పాటు ఎంపిటిసిలు మమతాభాను, కవితా యాదగిరి, భాగలక్ష్మి, దుర్గాప్రసాద్ కాంగ్రెస్ లో చేరటంపై  నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతోంది. కెసియార్ కు ఫాం హౌస్ ఉన్నది జగదేవ్ పూర్లో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతం ఎంపిపి కూడా కాంగ్రెస్ లో చేరటం ఆశ్చర్యంగా ఉంది.

 ఎప్పుడైతే ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారో వెంటనే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంటూ ప్రకటించటం విశేషం. సరే, ఉత్తమ్ చెప్పినట్లు గజ్వేల్ లో కాంగ్రెస్ గెలవకపోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కెసియార్ పై క్షేత్రస్ధాయిలో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్దమైపోతోంది.  ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించిన అనేక నియోజకవర్గాల్లో అభ్యర్ధులపై స్ధానికంగా నేతలు, జనాలు వ్యతిరేకత కనబరుస్తున్నారు. అందుకే అసంతృప్తులను బుజ్జగించేందుకు కొడుకు కెటిఆర్, మేనల్లుడు హరీష్ తదితరులను రంగంలోకి దింపారు. అటువంటిది గజ్వేల్ నియోజకవర్గంలోనే కేసియార్ పై వ్యతిరేకతతోనే పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరటమంటే చిన్న విషయం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: