రాష్ట్రంలో ఐటి దాడులకు సంబంధించి చంద్రబాబునాయుడు వాదన భలే విచిత్రంగా ఉంటోంది. తాను అహోరాత్రుళ్ళు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఐటి దాడులని ఇంకోటని చెప్పి రాష్ట్రాభివృద్ధి జరగకుండా కేంద్రం కుట్రపన్నుతోందంటూ చంద్రబాబు తరచూ కేంద్రంపై మండిపడుతున్న విషయం తెలిసిందే. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి ఎక్కడపడితే అక్కడ అవకాశం ఉన్నంతలో కేంద్రంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. అందుకు టిడిపి మీడియా కూడా మద్దతుగా నిలబడి యధాశక్తి బాకాలూదుతున్నాయ్.  

నిజానికి గతంలో లేనంతగా  చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలైన వైసిపి, బిజెపి, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ కూడా చంద్రబాబు అవినీతిపై రోజూ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. రాజకీయ ఆరోపణలను పక్కనపెట్టినా పట్టిసీమ, తాత్కాలిక అసెంబ్లీ, పిడి ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలు దారి మళ్ళటం, సచివాలయంతో పాటు పోలవరం నిర్మాణాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించింది వాస్తవమే కదా ?

అంటే ఒకవైపు భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా కోట్ల రూపాయలు దోచేస్తున్నా ఎవరిపైనా చర్యలు లేవు. అందుకే వినిపిస్తున్న ఆరోపణలు, కాగ్ నిర్ధారింపుల ఆధారంగా ఐటి దాడులు జరిగితే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నట్లేనా ? అంటే జరిగిన అవినీతి కళ్ళకు కనబడుతున్నా, దోచుకున్న వాళ్ళపై ఐటి దాడులు జరక్కూడదన్నదే చంద్రబాబు ఉద్దేశ్యమా ?

 రాష్ట్రంలో ఇంతమంది నేతలున్నారు. ఇంతమంది వ్యాపారస్తులున్నారు. మరి వాళ్ళందరిపైనా ఐటి దాడులు ఎందుకు జరగటం లేదు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని అందునా టిడిపి మద్దతుగా చెలరేగిపోతున్న వారిపైనే ఐటి కన్నుపడింది. ఈరోజు ఐటి దాడులు జరుగుతున్న మంత్రి నారాయణ అయినా, టిడిపి నేత బీద మస్తాన్ రావు పైనా ఐటి దాడులు జరుగుతున్నాయంటే వారిపై వినిపిస్తున్న ఆరోపణలే ప్రధాన కారణం.

కాబట్టి నేతలపై జరుగుతున్న ఐటి దాడులకు, రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి లింక్ లేదన్నది వాస్తవం. రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందంటే అది రాజకీయపరమైన సమస్య. ఆ సమస్యను చంద్రబాబు రాజకీయంగానే ఎదుర్కోవాలి. అంతే కానీ జరగని అభివృద్ధిని జరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటూ, అవినీతి జరుగుతున్నా ఎక్కడా అవినీతి జరగటం లేదని చెప్పుకున్నంత మాత్రనా సరిపోదు. అంతెందుకు, ఓటుకునోటు కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రదారుడని అందరికీ తెలుసు.

ఎంఎల్ఏ ఓటు కొనే క్రమంలో తెలంగాణా ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికేశారు కదా ? అరెస్టుకు భయపడే కదా అర్ధాంతరంగా హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు విజయవాడకు పారిపోయింది. ఎంఎల్ఏ ఓటును చంద్రబాబు కొనబోవం, రెడ్డ హ్యాండెడ్ గా పట్టుబడటం, చంద్రబాబు అమరావతికి పారిపోవటం కూడా కేంద్రప్రభుత్వం కుట్రేనా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: