వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజవర్గంలో తెలుగుదేశంపార్టీ జెండా ఎగిరేది అనుమానమేనా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. దశాబ్దాల పాటు తాడిపత్రిలో పార్టీలతో నిమిత్తం  లేకుండా జేసి  సోదరులే గెలుస్తున్నారు. కానీ పోయిన ఎన్నికల వరకూ సాగిన జేసి జైత్రయాత్ర వచ్చే ఎన్నికల్లో సాగేది అనుమానమే అని స్వయంగా టిడిపి నేతల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. సోదరుల ఒంటెత్తు పోకడలతో మామూలు జనాలే కాకుండా పార్టీలోని నేతలు కూడా విసిగిపోయారట. దాంతో అన్ని వైపులా సోదరులపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది.

 

ప్రస్తుత విషయానికి వస్తే తాడిపత్రిలో వైసిపి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసి సోదరులను గట్టిగా ఢీ కొంటున్నారు. మొన్నటి వరకూ నియోజకవర్గంలో జేసి సోదరులను ఢీకొనే శక్తున్న నేతలు ప్రతిపక్షాల్లో కూడా లేరు. అందుకనే వారు ఆడిందే ఆటగా సాగింది. కానీ దాదాపు రెండేళ్ళ క్రితం నియోజకవర్గంలోనే గట్టి నేతగా పేరున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏరికోరి సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుండి జేసి  బ్రదర్స్ కు ఎప్పటికప్పుడు వైసిపి నేతలు ఢీ కొంటున్నారు. జేసిలకు వ్యతిరేకంగా పెద్దారెడ్డి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో జనాల్లో చొచ్చుకుపోతున్నారు.

తాజాగా నియోజకవర్గంలోని ముచ్చుకోట రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయాలని పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు భారీ ఆందోళన మొదలుపెట్టారు. అయితే, ఆందోళన మొదలుకాగానే పోలీసులు పెద్దారెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్ళారు. పోలీసులు పెద్దారెడ్డిని అరెస్టు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు ఏదో ఒక కేసులో పెద్దారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతునే ఉన్నారు ఏదో కేసులో 14 రోజుల రిమాండ్ నుండి పెద్దారెడ్డి ఈ మధ్య బయటకు వచ్చారు. మళ్ళీ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకనే పోలీసులతో చెప్పి తనను పదే పదే జేసి సోదరులు అరెస్టు చేయిస్తున్నట్లు పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిజమవుతాయేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: