ఇపుడిదే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఇంకోవైపు జనసేనకు ఏ ప్రాంతంలో పట్టుంది ? ఏ ఏ సామాజికవర్గాలు మద్దతుగా నిలబడుతున్నాయనే  విషయంలో మాత్ర క్లారిటీ రాలేదు. పార్టీని ప్రాంతాల వారీగా పటిష్టం చేయటం మానేసి పార్టీలో చేరిన కొద్దిమంది పవన్ పై ఆధిపత్యం కోసం కొట్టేసుకుంటున్నారు. ఎవరికి వారు తామే పవన్ కు దగ్గరనిపించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన వర్గాల సమాచారం ప్రకారం ఉన్న పదిమందిలోనే పదిగ్రూపులున్నాయట.

 

ప్రతిపార్టీలోను అధినేత చుట్టూ ఓ కోటరీ ఉంటుందనటంలో సందేహం లేదు. కాకపోతే కోటరీలోని ముఖ్య నేతలందరికీ వారి వారి ప్రాంతాల్లో జనబలముంటుంది. లేకపోతే వారి సామాజికవర్గాల్లో బాగా పట్టుంటుంది. ఏదో ఓ రూపంలో పట్టున్న నేతలనే అధినేతలు తమచుట్టూ పెట్టుకుంటారు. కానీ జనసేనలో విచిత్రమేమిటంటే పవన్ చట్టూ ఉన్న కోటరిలో ఏ ఒక్కరికీ జనాల్లో పట్టులేదు. పవన్ చుట్టూ ఉన్న వారెవరూ జనాలకు ఏమాత్రం పరిచయటం లేదు. ప్రత్యక్షంగా జనాలతో ఏమాత్రం సబంధం లేని వారినే పవన్ తనచుట్టూ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ తప్పంతా ఇక్కడ పవన్ దే అన్న విషయం స్పష్టమవుతోంది.

 

ఆలూ చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా తయారైంది పవన్ కోటరీ కథ. జనసేన అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు ఊహించుకుని ఎవరికి వారుగా టిక్కెట్లను పలువురు ఆశావహులకు హామీలిచ్చేస్తున్నారట. టిక్కెట్లపై హామీలంటే ఊరకే ఇచ్చేస్తారా ? ఇక్కడే డబ్బుల బేరాల జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఒకే నియోజకరవర్గంలో టిక్కెట్టు కోసం కోటరీలోని వ్యక్తులు వేర్వేరు నేతలకు హామీలిచ్చేయటం, తమ మాట చెల్లుబాటయ్యేట్లు పవన్ పై ఒత్తిడి తెస్తుండటంతోనే సమస్యలు మొదలవుతున్నాయి. ఆ విషయాల్లోనే కోటరీలోని ముఖ్యుల మధ్య విభేదాలు మొదలై చివరకు పవన్ దాకా వెళ్ళి రోడ్డున పడటంతో మొత్తం పార్టీనే పలుచనైంది.

 

మొన్నటి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను కూడా పవన్ అర్ధాంతరంగా ముగించటం వెనుక కూడా ఈ గ్రూపులగోలను భరించలేకే అని పార్టీలో చెప్పుకుంటున్నారు. పార్టీలో పెరిగిపోతున్న గ్రూపుల గోలను భరించలేకే చివరకు పవన్ బహిరంగంగా కోటరీకి వార్నింగ్ ఇవ్వటం కొసమెరుపు. ఆధిపత్యం కోసం పార్టీలో వివాదాలు పెరుగుతుండటాన్ని సహించేదిలేదని పవన్ బహిరంగగంగానే హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైతే జనసేన అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు. అసలు పార్టీకి ఏ ప్రాంతంలో పట్టుందో కూడా ఎవరికీ స్పష్టమైన అంచనా లేదు.


ఉత్తరాంధ్రలో పర్యటించినపుడు వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జనసేనదే పైచేయని ప్రచారం జరిగింది. ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించినపుడు ఉభయగోదావరి జిల్లాలు జనసేనదే అంటూ ఊగిపోయారు. ప్రచారం ముగిసిన తర్వాత చూస్తే జనసేన గురించి అసలు మాట్లాడుకున్నవారే కనబడటంలేదు. ఏదో పవర్ స్టార్ పేరుతో అభిమాన సంఘాలుండటం, మొత్తంగా మెగా ఫ్యామిలీకి జనాల్లో ఇంకా క్రేజుండటంతో పవన్ వచ్చాడని అభిమానులు మాత్రం బాగా హడావుడి చేశారు.  పవన్ పర్యటనలో ఎంత హడావుడి చేశారో తర్వాత అంతే చప్పపడిపోయారు. నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి  ఏదో పాలపొంగులాంటి అభిమాన సంఘాల మీద పవన్ ఆధారపడితే అంతే సంగుతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: