ఏదైన ఓ సంఘటన జరిగితే దానిపై విచారణ జరిపించడం పరిపాటి. ప్రత్యేక విచారణ అంటే ఇంకాస్తా సీరియస్ గా ఉన్నారనుకుంటారు. అలా ప్రత్యేక విచారణ కమిటీ (సిట్) ఈ మధ్య కాలంలో ఏపీలో చాలానే వేశారు. ఆర్భాటంగా నియమించిన  సిట్ సిత్రాలు ఆ త‌రువాత అసలు కధలో తెలుస్తున్నాయి. 


కంచికి చేరని సిట్ :


ఏ కధ అయినా కంచికి చేరాలి. కానీ సిట్ కధలు మాత్రం ఎప్పటికీ కంచికి చేరవు. వేయడం వరకే మా ధర్మం అని ఏలిన ప్రభువులు అనుకుంటారేమో. నివేదికల కోసం కనీసం ఆరా తీయరు. ఈ వింత చొద్యం విశాఖ జిల్లాలోనే ఎక్కువగా సాగిపోతోంది. నాడు భూ కబ్జాలపై సిట్ వేశారు. నేడు అరకు ఎమ్మెల్యే హత్యపై సిట్ నియమించారు. కానీ అవి బయటకు రావడానికి జీవిత కాలం లేట్ అయ్యేట్టుంది.


కోల్డ్ స్టోరెజ్ :


విశాఖ భూ కబ్జాలపై రెండేళ్ళ క్రితం ఏపీ రాజకీయం దద్దరిల్లింది. ఎక్కడ చూసినా అంగులం భూమి కూడా మిగల్చకుండా మింగేస్తున్నారంటూ ఎర్రన్నలతో సహా అంతా రోడ్డెక్కారు. సీబీఐ విచారణకు డిమాండు చేశారు. ఈ గడబిడలో పసుపు పార్టీ ప్రభుత్వం పరువు అంచుల దాకా పోయింది. దాంతో సిట్ అంటూ చంద్రబాబు సర్కార్ భారీ ప్రకటన ఇచ్చింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలనీ ఆదేశించింది.
అలా రెండేళ్ళ క్రితం నియమించిన సిట్ చాలా తాపీగా విచారణ చేసి పది నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చేసింది. ఇపుడా నివేదిక కోల్డ్ స్టోరేజ్ లో ఉంది.


ఇపుడు అంతెనా :


ఇక అరకు ఎమ్మెల్యే కిడార్ సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల దారుణ హత్యలపై ప్రభుత్వం వెంటనే సిట్ అంటూ ఆర్డర్ వేసింది. మూడు రోజుల్లో నివేదిక రావాలంటూ  హుకుం జారీ చేసింది. ఇప్పటికి ఇరవై రోజులయ్యాయి. నివేదిక ఊసేలేదు. దీనిపై పాడెరు వచ్చిన మంత్రి లోకేష్ ని మీడియా అడిగితే తొందరెందుకు, వారి పని సరిగ్గా చేయనీయండంటూ జవాబు  దాటేశారు.


అదేనా సంగతి :


సిట్ నివేదికల వెనక కధలు వేరేగా ఉన్నాయట. అందుకే అవి అలా బుట్టలోనే ఉంటాయట. భూ కబ్జాల వెనక సర్కార్ పార్టీకి చెందిన పెద్ద మనుషులే ఉండడంతో అలా సిట్ నివేదిక చెప్పిన నగ్త సత్యాలు బయటపెట్టలేక కోల్డ్ స్టోరేజ్ లో చల్లగా ఉంచేశారు. ఇపుడు కిడారి, సోమల దారుణ హత్యల వెనక కూడా అధికార పార్టీకి చెందిన వారే సూత్రధారులని సిట్ నివేదిక వెల్లడించడంతో దానిని కూడా అలాగే దాచాలనుకుంటున్నరని టాక్. మొత్తానికి సిట్ అంతే ఏకంగా కోల్డ్ స్టోరేజ్ అన్న అర్ధాన్ని మాత్రం టీడీపీ సర్కార్ చెప్పకనే చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: