రాష్ట్రంలో ఈ రోజు పర్యటించిన 15వ ఆర్ధిక సంఘం ఏపీకి ఉత్త చేయి చూపించింది. తమ వల్ల ఏం కాదని కూడా కుండ బద్దలు కొట్టింది. అధికార, విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఆంధ్ర ప్రదేశ్ ని ఆదుకోవాలని కోరినా చేయగలిగింది  ఏదీ లేదని కూడా చెప్పుకొచ్చింది. ప్రత్యేక హోదా అంశంతో తమకు సంబంధం లేదని 15వ ఆర్ధిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో అలాంటి నిబంధన ఏది లేదని ఆర్ధిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె. సింగ్ స్పష్టం చేశారు. ఇది ఏపీ ఆశలను నిలువునా నరికేయడమే.


నిజాలు చెప్పిన బాబు :


ఇదిలా ఉండగా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలతో సమావేశమైన 15వ ఆర్ధిక సంఘం మీటింగులో చంద్రబాబు చాలావరకూ నిజాలు చెప్పారు. ఇందులో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని. ఇది మిగిలిన రాజధానుల మాదిరిగా రావడానికి కనీసంగా మరో ఇరవై  ఏళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికిపుడు అద్భుతాలు ఐతే అక్కడ ఏమీ జరగవని కూడా అన్నారు. ప్రధానంగా అమరావతిలో మౌలిక సదుపాయాలు ఇతరమైన డెవలప్మెంట్ కోసం ఏకంగా లక్షా 9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని బాబు వివరించారు.


బుందేల్ ఖండ్  ప్యాకేజ్ :


ఏపీలోని ఏడు వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద 24 వేల కోట్ల రూపయల నిధులను ఇవ్వలంటూ ఆయన ఆర్ధిక సంఘానికి వినతి చేశారు. అలాగే ఉన్నఫలంగా ఏపీ రాజధానికి 9 వేల కోట్లు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాని అమలు చేయాలని కూడా బాబు కోరారు.


మా చేతిలో లేదు :


ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్ధిక సంఘం సిఫార్స్ చేసిందన్న దానిపై 15వ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు సింగ్ విస్మయం వ్యక్తం చేయడం ఆసక్తికరమే. మా చేతిలోనే హోదా అంశం ఉండదు. అలాంటిది మేమెలా  వద్దంటూ సిఫార్స్ చేయగలమని ఆయన సందేహం వ్యక్తం చేయడం విశేషం. ఇక ఏపీ విభజన హామీలు, చట్టంలోనివన్ని అమలు చేసే మెకానిజం ఏదీ ఇపుడు కేంద్రం వద్ద లేదని కూడా సింగ్ నిజం చెప్పేశారు.


జాతీయ అభివ్రుధ్ధి మండలి ఉన్నపుడు అప్పటి ప్రధాని వాజ్ పేయి కొన్ని రాష్ట్రాలకు హోదా కల్పించారని కూడా గుర్తు చేశారు. మొత్తానికి 15వ ఆర్ధిక సంఘం వచ్చింది, వెళ్ళింది అన్నట్లుగానే ఉంది తప్ప నిధులు ఏమీ రాలవన్నది మాటలను బట్టి తెలిసిపోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: