చూడబోతే ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధిపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకే నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటమే అందుకు ఉదాహరణ. మనోహర్ బాటలోనే మరికొందరు మాజీ మంత్రులు, నేతలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన నేతలను ఘర్ వాపసీ పద్దతిలో తిరిగి పార్టీలోకి తీసుకురావాలంటూ ఆమధ్య రాహూల్ పిలుపిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

 

రాహూల్ పిలుపుకు స్పందించింది ఒక్క మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్  రెడ్డి మాత్రమే. కిరణ్ కూడా ఎందుకొచ్చారంటే ఆయనకు ఏ పార్టీ నుండి ఆహ్వానం రాలేదు కాబట్టి. అప్పటికీ తమ్ముడు కిషోర్ రెడ్డిని టిడిపిలోకి పంపారు లేండి. ఒకవైపు రాహూల్ పిలుపిస్తుంటే ఇంకోవైపు ఒక్కొక్క నేత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోండ్రు మురళి కూడా టిడిపిలోకి జంప్  చేయబోతున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే భేటీ కూడా అయిపోయింది. ఇక, అనంతపురం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి సాకే శైలజానాధ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.


ఇపుడు కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో కూడా చాలామందికి ఇతర పార్టీల నుండి ఆహ్వానాలు లేకే పార్టీలోనే ఉండిపోయారన్నది వాస్తవం. ఇకరకంగా ఇపుడు కాంగ్రెస్ లో ఉన్న వారిలో అత్యధికులకు సమీపభవిష్యత్తులో పార్టీ పునరుజ్జీవనంపై నమ్మకం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని రాహూల్ స్వయంగా ప్రకటించినా జనాలెవరు నమ్మటం లేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదెన్నడు ? ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చెదెపుడు ? అన్న విషయమే మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

అప్పట్లో పచ్చగా కళకళలాడుతున్న సమైక్యాంధ్రాను అడ్డుగోలుగా విభజించింది ఇదే కాంగ్రెస్. మెజారిటీ ప్రజల మనోభవాలకు అప్పట్లో సోనియాగాంధి, రాహూల్ ఏమాత్రం విలువ ఇవ్వలేదు. అప్పట్లో విభజించటం ఎందుకు ? మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పటమెందుకు ? అన్నదే సగటు ఆంధ్రుడి సందేహం. రాష్ట్రాన్ని అడ్డుగులోగా విభజించి తప్పు చేశామని ఇప్పటి వరకూ సోనియా, రాహూల్ లో కించిత్ పశ్చాత్తాపం కూడా కనిపించటం లేదు. అందుకే 2014 ఎన్నికల్లో గొయ్యి తవ్వి పాతరేశారు.


రేపటి ఎన్నికల్లో కూడా అదే పరిస్ధితి ఉంటుందనటంలో సందేహం లేదు. కాకపోతే బలమైన అభ్యర్ధుల్లో కొందరికి డిపాజిట్లు వస్తే రావచ్చు. అసలు 175 నియోజకవర్గాల్లోను పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరుకుతారా అన్నది కూడా అనుమానమే. పార్టీ పరిస్ధితిపై నేతలకు మంచి అవగాహన ఉంది కనుకనే రాహూల్ పిలుపును కూడా లెక్క చేయకుండా ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది నేతలు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి రాహూల్ కు పెద్ద షాక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.   

 


మరింత సమాచారం తెలుసుకోండి: