ఆపరేషన్ గరుడలో భాగంగానే కేంద్రప్రభుత్వం తెలుగుదేశంపార్టీ నేతలపై దాడులు చేయిస్తోందంటూ తన ట్వట్టర్ ఖాతా ద్వారా చినబాబు నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మోడి ఆపరేషన్ గురుడలో దాడులు చేయిస్తూ టిడిపిని భయపెడదామని చూస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలను నెరవేర్చాలని అని నిలదీసినందుకే మోడి ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారంటూ మండిపడ్డారు.  మొన్న బీద మస్తాన్ రావు, నిన్న సుజనా చౌదరి, ఈరోజు రమేష్. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపి సిఎం రమేష్ పై ఐటి దాడులు అంటూ ధ్వజమెత్తారు.


సరే జరుగుతున్న ఐటి దాడులను పక్కనపెడదాం. అసలు ఏపి ప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడు, లోకేష్, కేంద్రంలో మంత్రులుగా ఉన్నపుడు సుజనా చౌదరి, రమేష్ ఎప్పడూ కేంద్రాన్ని నిలదీసింది లేదు. ఎందుకంటే, ఎన్డీఏలో ఉన్నంత కాలం చంద్రబాబుకూ కేంద్రప్రభుత్వం లేదా నరేంద్రమోడికి ఊడిగం చేయటానికే సరిపోయింది. కేంద్రం తానా అంటే చంద్రబాబు తంధానా అంటూ వంతపాడారు. దానికితోడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఓటుకునోటు కేసులో తగులుకోవటంతో కేంద్రాన్ని డిమాండ్ చేసే స్ధాయిని చంద్రబాబు కోల్పోయారు.

 

ఎప్పుడైతే ఓటుకు కోట్లు కేసులో తగులుకున్నారో అప్పటి నుండే మోడి ముందు   చంద్రబాబు పలుచనైపోయారు. దాని ఫలితంగానే కేంద్రానికి ఏపి ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు. అందుకే విభజన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీని సాధించలేకపోయారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాతే ఏపి ప్రయోజనాలని, ప్రత్యేకహోదా అంటూ చంద్రబాబు మాట్లాడటం అందరికీ తెలిసిందే.


అదే సమయంలో నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. తమ్ముళ్ళ ఆస్తులు, వ్యాపారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపణలు కూడా కమ్ముకుంటున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే ఐటి, ఈడి దాడులు జరుగుతున్నాయి. దాన్నే రాష్ట్రంపై దాడులుగా, ప్రజాస్వామ్యంపై దాడులుగా చంద్రబాబు అండ్ కో ప్రచారం చేయిస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: