మొత్తానికి నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. ఇప్పటి వరకూ ఆ పార్టీలో చేరిన నేతల్లో మనోహరే కాస్త పేరున్న నేతగా చెప్పుకోవాలి. మొన్నటి వరకూ చేరిన వారంతా అవుట్ డేటెడ్ అనే అనుకోవాలి. లేకపోతే ఆ పర్టిక్యులర్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా తెలీని వాళ్ళే.  మనోహర్ చేరారు సరే. మరి ఆ విషయం మీడియాలో పెద్దగా ఫోకస్ అవ్వని విషయం కూడా చాలా మంది గ్రహించలేదు. పవన్ కల్యాణ్ తో పాటు మనోహర్ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళారు. వెంకన్న దర్శనం తర్వాత తిరుపతిలో జనసేన కండువాను కప్పుకున్నారు. ఆ విషయం అందరికీ ఎలా తెలిసిందంటే జనసేన మీడియా హెడ్ నుండి ఓ ప్రెస్ నోట్ రిలీజైతేనే.


నిజానికి మనోహర్ రెండు సార్లు గుంటూరు జిల్లా తెనాలి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మనోహర్ ఐడెంటి నాదెండ్ల భాస్కరరావనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రిగా ఖమ్మం ఎంపిగా నాదెండ్ల భాస్కరరావు చాలా పాపులర్. అంతటి ఘనచరిత్రున్న నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరితే పెద్దగా హైలైట్ కాకపోవటం  ఆశ్చర్యంగా ఉంది. కనీసం పవన్ తిరుపతిలో ఓ మీడియా సమావేశం పెట్టి మనోహర్ ను పరిచయం చేసినా కాస్త హుందాగా ఉండేది.

 

రేపటి నుండి మనోహర్ హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడలో మీడియా ముందుకు రావాల్సిన  నేతే. అయితే, ఆయనేమీ మీడియా ఫ్రెండ్లీకాదు. ఏనాడు మీడియాతో సన్నిహితంగా ఉన్న దాఖలాల్లేవు. పోనీ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన పట్టున్న నేతా అంటే అదీ కాదు. మనోహర్ జనసేనలో చేరిక సందర్భంగా తెనాలిలో ఓ పెద్ద కార్యక్రమం కూడా జరిగినట్లు కనిపించలేదు. మనోహర్ చేరికను నిజానికి పవన్ కల్యాణే పెద్ద హడావుడి చేస్తారని అనుకున్నారు. చివరకు మనోహర్ జనసేనలో చేరిన విషయం సోషల్ మీడియాలో మాత్రమే  ఓ మోస్తరుగా కనిపించింది. జరిగిన విషయం చూస్తే మరి మనోహర్ విలువ ఇతేనా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: