చూడబోతే వ్యవహారం అలాగే కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో బలంగా ఉండాలని కోరుకుంటుంది. వీలైతే పక్క రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటుంది. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి మాత్రం అర్ధం కావటం లేదు. ఎందుకంటే, పార్టీ పెట్టి ఇప్పటికి ఐదేళ్ళవుతున్నా ఇంత వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎప్పుడూ పర్యటించింది లేదు. పైగా రెండు ప్రాంతాలపైన మాత్రం శ్రద్ధపెట్టి మిగిలిన ప్రాంతాలను గాలికి వదిలేసినట్లు కనబడుతోంది. అందుకు పవన్ చేస్తున్న పర్యటనలే ఊతమిస్తున్నాయి.

 

ప్రజా పోరాటయాత్ర పేరుతో పవన్ చాలా కాలం క్రితం ఓ కార్యక్రమాన్ని ఆరంభించారు. యాత్రను తిరుపతి నుండే ప్రారంభించినా వెంటనే ఉత్తరాంధ్రకు వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాతో అసలు యాత్రను ప్రారంభించారు. నాలుగురోజులు కాగానే విశ్రాంతన్నారు. మళ్లీ ఓ పదిరోజుల తర్వాత యాత్రను ప్రారంభించి మళ్ళీ ఆపేశారు. మొత్తానికి విజయనగరం, విశాఖపట్నంలో కూడా టూర్ అయ్యిందనిపించుకున్నారు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లా అన్నారు. ఓ నాలుగు నియోజకవర్గాలు కాగానే మళ్ళీ యాత్రకు బ్రేకుపడింది.

 

ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో యాత్రన్నారు. నా నాలుగు నియోజకవర్గాలు కాగానే మళ్ళీ బ్రేకుపడింది.  ఇలా బ్రేకులు పడుతూనే ఇటు ఉభయగోదావరి జిల్లాలు లేకపోతే అటు ఉత్తరాంధ్రలో మాత్రమే పర్యటిస్తున్నారు. సమయం అంతా ఐదు జిల్లాల్లోనే గడిపేస్తే మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఎప్పుడు పర్యటిస్తారు ? రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప  జిల్లాలున్నాయి. కోస్తా ప్రాంతంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలున్నాయి.


కోస్తా ప్రాంతంలోని మెజారిటీ ప్రాంతాల్లో తెలుగుదేశంపార్టీకి పట్టెక్కువగా ఉంది. రాయలసీమలోని మెజారిటీ స్ధానాల్లో వైసిపికి గట్టి పట్టుంది. పోయిన ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా టిడిపి మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరులో మెజారిటీ స్ధానాల్లో గెలిచినా అనంతపురం పెద్ద బొక్కే పడింది.   ఇక, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తలా మూడు సీట్లు మాత్రమే గెలిచింది.  

 

ఇక, కోస్తా ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మంచి మెజారిటీ సాధించింది వైసిపి. కాకపోతే తూర్పు గోదావరి జిల్లాలో  బాగా దెబ్బతిన్నది. పశ్చిమగోదావరి జిల్లాలో అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.  ఉభయగోదావరి జిల్లాల్లో అయినా, ఉత్తరాంధ్రలో అయినా తన వల్లే టిడిపికి అన్ని స్ధానాలు వచ్చాయనేది పవన్ వాదన. బహుశా అందుకనే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలపైన మాత్రమే దృష్టి పెట్టారా అన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ భావన కూడా అదే అయితే  రాయలసీమ, కోస్తా ప్రాంతంలో కొంత భాగాన్ని వదిలేసుకున్నట్లేనా ?

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: