ఎన్నికల సీజన్ మొదలైందనడానికి రాజీనామాలు, చేరికలు ఉదాహరణ. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతూ జెండా ఎత్తేస్తున్న నేతాశ్రీలు హాట్ న్యూస్ అయిపోతున్నారు. మరో  వైపు అధినేతలకు హై బీపీలూ పెంచేస్తున్నారు. వారి వల్ల ఎంత లాభం ఎంత నష్టం అన్న కూడికలు, తీసివేతల వ్యవహారం అటు పార్టీల్లోనూ, ఇటు జనాల్లోనూ ఓ రేంజిలో జరుగుతోంది.


సుందరంగా :


ఆయన పూర్తి పేరు సుందరపు విజయకుమార్. టీడీపీకి నమ్మిన బంటు, కష్టకాలంలో సైతం పార్టీని కట్టుదిట్టంగా నడిపించిన అంకిత భావం కలిగిన తమ్ముడు. అటువంటి  తమ్ముడు ఇపుడు అదే పార్టీపై అలిగారు. అంతేనా కట్టు దాటేశారు. పసుపు శిబిరానికి రాం రాం అనేశారు. ఉన్నది, చేసింది ఇక చాలు, నా సేవలు కొత్త పార్టీకేనంటూ కుండ బద్దలు కొట్టారు. సుందరపు నిర్ణయంతో విశాఖ జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గం చిందర వందరగా తయారైంది.


సైకిల్ కి పంచర్ :


సుందరపు టీడీపీకి తాజాగా రాజీనామా చేసేశారు. ఇంతకాలం అంతా  అనుకుంటున్న దాన్నే నిజం చేసి చూపించారు. తనతో పాటు ఏకంగా రెండు వేల మంది ముఖ్య కార్యకర్తలను కూడా వెంట తీసుకెళ్తూ రాజీనామాలు చేయించారు.  దీంతో అక్కడ టీడీపీకి పెద్ద దెబ్బే పడిపోయింది. సుందరపు నిర్ణయం సైకిల్ పార్టీకి పంచర్లు వేస్తే జనసేనకు ఊపిరి పోసింది. 


19న ముహూర్తం :


తాను, మొత్తం వేలాదిగా కీలకమైన టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశామని సుందరపు మీడియాకు చెప్పేశారు. విజయదశమి వేళ ఈ నెల 19న తామంతా కలసి జనసేనలో జాయిన్ అవుతున్నామని ఆయన ప్రకటించారు. పార్టీకి ఎంతో సేవ చేసినా ఫలితం లేకపోవడం వల్లనే ఈ కఠిన నిర్ణయం  తీసుకోవాల్సివచ్చిదని సుందరపు చెప్పారు. 


గెలుపు ఖాయమా :


సుందరపు వంటి బలమైన నేత జనసేనలో చేరడం ఆ పార్టీకి బూస్టప్ లాంటిదే. పార్టీ పరంగానే కాదు, జనంలోనూ మంచి పేరున్న సుందరపు పట్ల సానుభూతి కూడా ఉంది. పైగా పవన్ జనాకర్షణ కలసి ఎలమంచిలిని జనసేన జెండా ఎగురవేసేలా చేస్తాయా అన్న చర్చ సాగుతోంది. ఇక్కడ వలస‌ నాయకుడు పంచకర్ల రమేష్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకే మరో మారు టికెట్ కన్ ఫాం అయింది. దాంతో టీడీపీకి దెబ్బేనని అంటున్నారు. వైసీపీ నుంచి కన్నబాబు రాజు ఉన్నారు. టీడీపీ ఓట్లు చీలిపోతే ఆయనకు కూడా చాన్స్ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: