విజయనగరం జిల్లాలో కీలకమైన రాజ వంశాలల్లో బొబ్బిలి ఒకటి. ఆ పేరు చెబితే చాలు పౌరుషానికి మారు పేరుగా భావిస్తారు. బొబ్బిలి గడ్డ అంటేనే పోరుకు పెట్టింది పేరు. ఆలంటి ఇలాకాలో ఇపుడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించింది. బొబ్బిలి లో   జగన్ ఎలా గర్జిస్తాడన్నది ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.


సుజయకు సవాల్ :


బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సుజయ క్రిష్ణ రంగారావుకు జగన్  సవాల్ చేయనున్నారా. నిన్నటి వరకు వైసీపీలో ఉండి మంత్రి పదవి కోసం పార్టీని ఫిరాయించిన రాజు గారికి అదే కోట వద్ద జవాబు చెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు. సరిగ్గా రెండేళ్ళ క్రితం సుజయ క్రిష్ణ రంగారావు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. పరిహారంగా మంత్రి పదవిని కూడా పొందారు. అయితే జనం మనసులు మాత్రం ఆయన ఎప్పటికీ గెలుచుకోలేరని వైసీపీ నేతలు అంటున్నారు.


మళ్ళీ మాదే :


ఎప్పుడు ఎన్నికలు జరిగినా బొబ్బిలి వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఇక్కడ జనం మొదటి నుంచి కాంగ్రెస్ ని ఆదరిస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కూడా పెద్ద పీట వేశారు. అనేక ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఇక్కడ పరాజయం పాలైంది. టీడీపీ ఆవిర్భావం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమె ఆ పార్టీ నెగ్గిందని అంటే ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


రాజులపై ఆగ్రహం :


బొబ్బిలి రాజులంటే పౌరాషానికి ప్రతీకలని, మాట ఇస్తే వెనక్కు తగ్గరని పేరు. అటువంటిది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మారడాన్ని ఇక్కడ జనం తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో సరైన అభ్యర్ధిని వైసీపీ పెడితే మాత్రం సుజయకు పరాభవం తప్పదని కూడా అంటున్నారు. ఇప్పటికే శంబంగి చిన అప్పలనాయుడుని వైసీపీ ఇక్కడ ఇంచార్జ్ గా చేసింది. ఆయన మాజీ ఎమ్మెల్యే. దాంతో సుజయపై  తొడ కొడుతున్నారు.


జగన్ ఏం చెబుతోరో :


ఇక వైఎస్ జగన్ బొబ్బిలి గడ్డపై ఏం చెబుతారో అన్న ఉత్కంఠ అంతటా ఉంది. జగన్ ఇంతవరకు బొబ్బిలి రాజులపై డైరెక్ట్ అటాక్ చేయలేదు. ఈసారి పాదయాత్రలో మాత్రం మాటల తూటాలు పేలుతాయని, బొబ్బిలి రాజులపై  సెటైర్లు కూడా ఉంటాయని అంటున్నారు. ఫిరాయింపులపైన బెబ్బులిలా జగన్ అటాక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. జగన్ సభలో ఏం చెబుతారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: