వచ్చే ఎన్నికలకు సంబంధించి ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్  సభ టిక్కెట్టు ఇచ్చే హామీ మీదే బుట్టా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించారు. ఒకవైపు ఎంపిగా పోటీ చేయాలని అనుకుంటూనే మరోవైపు ఎంఎల్ఏగా పోటీ చేయటానికి కూడా రెడీ అవుతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ఆమధ్య  జిల్లాలో పర్యటించిన చినబాబు నారా లోకేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ బహిరంగంగానే జనాలను కోరారు. సరే, ఆ తర్వాత జిల్లా రాజకీయాల్లో దుమారమే రేగింది లేండి.

 

ఆ సంగతి అలా ఉంచితే మారిన రాజకీయ పరిణామాల్లో బుట్టాకు టిక్కెట్టు గ్యారింటీ లేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, తెలంగాణాలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపిలో కూడా పొత్తులు లేకపోయినా కనీసం అవగాహనైనా ఉంటుందని రెండు పార్టీల్లోని నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే కర్నూలు పార్లమెంటులో కాంగ్రెస్ తరపున కోట్ల సూర్య ప్రకాశరెడ్డి పోటీ చేయటం ఖాయం. కోట్ల పోటీలో ఉన్నపుడు బుట్టాకు చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనట.

 

అందుకనే అసెంబ్లీ నియోజకవర్గంపైన కూడ బుట్టా కన్నేశారట. అందుకని ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే, ఇక్కడో సమస్యుంది. ఎమ్మిగనూరు నుండి బి. జయనాగేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎంఎల్ఏగా ఉన్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏని కాదని చంద్రబాబు ఇక్కడ బుట్టాకు టిక్కెట్టిచ్చే అవకాశం లేనట్లే. మరి ఎంపిగా పోటీ చేసే అవకాశం లేక ఎంఎల్ఏగా టిక్కెట్టివ్వలేకపోతే బుట్టా పరిస్ధితి ఏమిటి ? ఇపుడీ విషయమే బుట్టాలో టెన్షన్ పెంచేస్తోందట. అదే వైసిపిలోనే ఉండుంటే టిక్కెట్టు గ్యారెంటీతో పాటు మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా ఉండేదేమో ?

 

సరే ఏదో జరిగిందేదో జరిగిపోయిందని సరిపెట్టుకుంటే రాజకీయ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అందుకనే రాజకీయ భవిష్యత్తుపై చినబాబుపైనే బుట్టా ఆధారపడ్డారట. ఈ విషయంలో లోకేష్ ను చంద్రబాబు పక్కనపెట్టేశారని పార్టీ వర్గాలంటున్నాయి. పైగా బుట్టాకు జిల్లాలో పార్టీ నేతల్లో ఏ ఒక్కరూ  సహకరించటం లేదు.  తమ నియోజకవర్గాల్లో జరిగే ఏ కార్యక్రమాలకు ఎంఎల్ఏలెవరూ బుట్టాను పిలవటం లేదు. అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో బుట్టా చేపట్టిన ఏ కార్యక్రమానికి పిలిచినా ఏ ఎంఎల్ఏగానీ నేతలు కానీ హాజరవ్వటం  లేదు.

 

చాలా మంది ఫిరాయింపుల్లాగే బుట్టా పరిస్దితి కూడా దయనీయంగా తయారైంది. ప్రస్తుత పరిస్దితుల ప్రకారమైతే వచ్చే ఎన్నికల్లో బుట్టాకు ఏ నియోజకవర్గంలో కూడా టిక్కెట్టు దక్కే అవకాశాలు దాదాపు లేనట్లే అన్నది తేలిపోయింది. మరి టిక్కెట్టు దక్కకపోతే  ఏం చేస్తారు ? ఏం చేస్తారు చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగిస్తే అవి చూసుకోవాల్సిందే. లేకపోతే అది కూడా ఉండదు. అప్పుడు ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకోవాల్సిందే. జరుగుతున్న పరిణామాలను గమినించిన లోకేష్ కూడా బుట్టా రేణుక విషయంలో చేతులెత్తేసినట్లే కనబడుతోంది. మరి టిక్కెట్టు రాకపోతే బుట్టా ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: