రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అనడానికి కాంగ్రెస్ టీడీపీ పొత్తు చెప్పుకుంటే సరిపోతుంది. ఈ రెండు పార్టీలు ఉప్పు, నిప్పు లాంటివి, పైగా కాంగ్రెస్ ని కూకటి వేళ్ళతో కూలదోసి టీడీపీ ఉమ్మడి ఏపీలో రావడమే కాదు. తరువాత కాలంలో దేశంలోనూ మంచి నీళ్ళు పుట్టని పరిస్తితి తెచ్చింది. ఓ విధంగా ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి టీడీపీ పరోక్ష కారణమన్నా తప్పులేదు.


అక్కడ స్నేహం:


తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జత కలిసాయి. రెండు పార్టీలూ కూటమి కట్టి బరిలో దిగిపోయాయి. బాయ్ బాయ్ అనుకుంటూ ఎంచక్కా చెట్టపట్టాలు వేసుకుంటున్నాయి. ఇదెవరన్నా అనుకున్నారా.. కల గన్నారా, మరి అక్కడ మహా కూటమి లాగానే ఏపీలోనూ రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలుపుతుందని అంటున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని అంటున్నారు.


వాళ్ళకు టిక్కెట్లు :


ఏపీలో కాంగ్రెస్ పొత్తుపై అపుడే రసవత్తరమైన చర్చ సాగుతోంది.  ఈ విషయంలో  కాంగ్రెస్ నాయకులు చాలా ఆశ పడుతున్నారు.  పొత్తు కుదిరితే పెద్ద తలకాయలకు జిల్లాకు ఒకటి రెండు వంతున సీట్లు ఖాయమని కూడా అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లా నుంచి ద్రోణం రాజు శ్రీనివాస్, రూరల్ నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులకు టికెట్లు ష్యూర్ అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. 


నాడు కేసులు వేసిన ఫ్యామిలీ :


ద్రోణం రాజు కుటుంబం విషయానికి వస్తే అప్పట్లో పెద్దాయన  ద్రోణం రాజు సత్యనారాయణ గారు అంటే 1987లో అన్న గారి మీద హైకోర్టులో కేసులు వేసి సంచలనం స్రుష్టించారు. అందులో ఏడు ఆరోపణలకు ప్రాధమికంగా రుజువులు ఉన్నాయని కోర్ట్ పేర్కొనడంతో ఎంటీయార్ రాజీనామాకు కాంగ్రెస్ పట్టు పట్టింది. ఆ కేసులపై ఎంటీయార్ స్టే  కూడా తెచ్చుకున్నారు. తరువాత కాలంలో ఆ కేసుల ప్రభావం వల్ల 1989 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. 

 

విశాఖ దక్షిణం నుంచి :


విశాఖ దక్షిణం నుంచి ద్రోణం రాజు శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతారని టాక్. ఆయన అక్కడ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం వుంది. పొత్తులో భాగంగా అయన‌కు ఆ సీటు టీడీపీ వదిలేస్తుందని అపుడే ప్రచారం స్టార్ట్ అయింది. అదే జరిగితే ఏ ద్రోణం రాజు కుటుంబం వల్ల టీడీపీ ఎన్ని ఇబ్బందుల పాలు అయిందో మళ్ళీ  అదే ఫ్యామిలీతో కలసి సాగినట్లవుతుంది. అయినా రాజకీయాల్లో ఇవన్నీ మాములే అనుకుంటే మాత్రం ఈ పొత్తు మాములుగానే చూడొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: