చంద్రబాబునాయుడును జనాలు నిలదీస్తున్నారు. తమకు సహాయం అందటం లేదని  ఒకవైపు తిత్లీ బాధితులు నిలదీస్తున్నారు. మరోవైపేమో ఇచ్చిన సాయం ఎటుపోతోందంటూ దాతలు నిలదీస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు విచిత్రమైన పరిస్దితే.  ఇంతకీ విషయం ఏమిటంటే, తిత్లీ బాధితులను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని, విరాళాలు ప్రకటించాలంటూ చంద్రబాబు బహిరంగ ప్రకటన చేశారు. ఆ ప్రకటనపైనే పలువురు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

 

అధికారంలోకి వచ్చిన కొత్తల్లో హుద్ హుద్ తుపాను ఉత్తరాంధ్రను వణికించేసింది. అప్పట్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేసిన సాయాన్ని పక్కనపెడదాం. ప్రైవేటు వ్యక్తులు, సంస్ధలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఇలా వివిధ రంగాల వాళ్ళు భారీ ఎత్తునే స్పందించారు. అయితే, ఆ విరాళాలను ప్రభుత్వం ఏ రూపంలో ఖర్చు పెట్టిందో ఇంత వరకూ లెక్కలు చెప్పలేదు. మొత్తం వచ్చిన విరాళాలెంత ? అందులో ఖర్చు చేసిందెంత ? అన్న వివరాలను ప్రభుత్వం చెప్పలేదు. దాంతో సహజంగానే అందరికీ ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి.

 

మళ్ళీ ఇపుడు తాజాగా తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయగరం జిల్లాలను పెద్ద దెబ్బే కొట్టింది. నష్టం అంచనాను రాష్ట్ర ప్రభుత్వం సుమరుగా రూ 4 వేల కోట్లుగా లెక్కేసింది. రూ 2800 కోట్లంటూ మొదట్లో లెక్కేసిన ప్రభుత్వం తక్షణ సాయంగా రూ 1200 కోట్లు విడుదల చేయాలంటూ ప్రదానికి చంద్రబాబు లేఖ రాశారు. సరే కేంద్రం ఎంతిస్తుందన్నది వేరే సంగతి. ఆ విషయాన్ని పక్కనపెడితే దాతలు విరాళాలివ్వాలంటూ చంద్రబాబు అప్పీల్ చేయటంతో వివాదం మొదలైంది. పోయిన సారిచ్చిన విరాళాలకు లెక్కలు చెప్పాలంటే దాతలు సోషల్ మీడియాలో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. తామిచ్చి విరాళాలకు లెక్కలు చెప్పాలని ఏకంగా ముఖ్యమంత్రినే నిలదీయటం బహుశా ఇదే మొదలేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: