పొలిటికల్ సర్కిల్స్ లో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది. అభ్యర్ధుల ఎంపికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఈజీ మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఒకవైపు అధికార తెలుగుదేశంపార్టీ మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉంటున్నాయి. రెండు పార్టీలు ఇఫ్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాయి కూడా. కానీ ఐదేళ్ళక్రితమే పుట్టిన జనసేన పార్టీ మాత్రం ఒకే ఒక అభ్యర్ధిని ప్రకటించింది. కారణం ఏమిటి ?

 

కారణం ఏమిటంటే, కొత్తగా అభ్యర్ధులను తయారు చేసుకోవటమో లేకపోతే కొత్త వారిని పోటీలోకి దింపటమో చేసే ఉద్దేశ్యంలో పవన్ లేనట్లు స్పష్టమవుతోంది. మరేం చేస్తారు ? ఏం చేస్తారంటే, ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తన పార్టీలోకి లాక్కుని టిక్కెట్లివ్వాలని పవన్ నిర్ణయించారట. అందుకనే తెలుగుదేశంపార్టీ, వైసిపిల్లోని అసంతృప్తులకు, టిక్కెట్లు రావని తేలిపోయిన వారికి గాలం వేయటానికి రెడీ అయిపోయారు.

 

పై రెండు పార్టీల్లో వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగు ఎంఎల్ఏలున్న చోట్ల ఎటూ ఇతరులకు టిక్కెట్లిచ్చే అవకాశం దాదాపు లేనట్లే. సర్వేల ఆధారంగా చివరి నిముషంలో అధినేతలు సిట్టింగులకు టిక్కెట్లు నిరాకరించే అవకాశాలు కూడా ఉన్నాయి లేండి. కాకపోతే అటువంటి నియోజకవర్గాలు తక్కువనే చెప్పాలి. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే టిక్కెట్టు ఇవ్వగలరు. మరి, మిగిలిన ఆశావహుల సంగతేంటి ?

 

అదే సమయంలో వివిధ పార్టీల్లోని ద్వితీయశ్రేణి నేతలుంటారు. వారిలో నియోజకవర్గంపై పట్టున్న వారుంటారు. సిట్టింగుల కారణంగానో లేకపోతే ఇతరత్రా కారణాల వల్లో వారికి పోటీ చేసే అవకాశం ఎప్పటికి రాదు. సో, ఇలా జనసేన ఇతర పార్టీల్లోని నేతల గురించి పెద్ద జాబితానే తయారు చేసుకుందట. అటువంటి వారికి జనసేన గాలమేయటం మొదలుపెట్టింది. వాస్తవం చెప్పుకోవాలంటే పై రెండు పార్టీల్లో పోటీ చేసే అవకాశం రాని వాళ్ళు, రాదని అనుకున్న వాళ్ళు మాత్రమే జనసేన వైపు చూస్తారన్నమాట.

 

అటువంటి వాళ్ళలో కొందరిని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టేశారట. మొన్ననే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ బాధ్యత అప్పగించారని సమాచారం. గుంటూరు జిల్లాలోని వైసిపి అసంతృప్త నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పరెడ్డి, టిడిపిలోని మాజీ ఎంఎల్ఏ దేవినేని మల్లికార్జునరావు తదితరులతో నాదెండ్ల మాట్లాడుతున్నట్లు తెలిసింది. సో, వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను రంగంలోకి దింపటానికి పవన్ కల్యాణ్ ఆ విధంగా ముందుకు పోతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: