సరిగ్గా నెల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దారుణ హత్యలతో హడలిపోతున్న తెలుగు తమ్ముళ్ళకు బేజారెత్తించేలా మావోయిస్టులు ఒక లేఖ రాసారు. మీడియా ముఖంగా విడుదల చేసిన ఆ లేఖలో విశాఖ ఏజెన్సీని నాశనం చేస్తున్న టీడీపీ నేతలను తరిమికొడతామని స్పష్టం చేశారు. పచ్చని గిరిజన ప్రాంతంలో చిచ్చు పెట్టేలా టీడీపీ విధానాలు ఉన్నాయని మావొలు మండిపడ్డారు.


మంత్రి అయ్యన్న సహా :


క్వారీల ముసుగులో మన్యాన్ని వినాశనం చేస్తున్నారంటూ గాలికొండ ఏరియా కమిటి కార్యదర్శి గోపి పేరిట రాసిన లేఖలో పేర్కొన్నారు. మన్యం, మైదాన ప్రాంతాలలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీల పైన  గోపీ తీవ్రంగా  ద్వజమెత్తారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు పీలా గోవిందరావు, కేయెస్ యెన్  రాజు, కిడారి సర్వేశ్వరరావు, వారి బంధువులు, టీడీపీ నాయకులు బుక్కా రాజేంద్ర , , కిమిడి రాంబాబు వంటి వారు ఏజెన్సీలో లైటరెట్, నాపరాయి, రంగురాళ్ళ క్వారీల పేరుతో ఆదివాసీ ప్రజల పంట భూములను విద్వన్సం చేయడానికి పూనుకున్నారంటూ గోపీ ఆరోపించారు.


సీఎం పైన విమర్శలు :


ఓవైపు ఆదివాసులను దోచుకుంటూ మరో వైపు ఆదివాసీ దినోత్సవం  రోజున పాడేరు వచ్చిన ముఖ్యమంత్రి బాక్సైట్ పై బూటకపు హామీలు ఇచ్చారని ఆ లేఖలో గోపీ ఫైర్ అయ్యారు. ఇకపై బాక్సైట్  తవ్వకాలు జరపబోమంటూ సీఎం చంద్రబాబు చెప్పడం  అమాయక గిరిజనులను మభ్యపెట్టడమేనని అన్నారు. ఇటువంటి విధానాలను గిరిజనం పూర్తిగా వ్యతిరేకించాలని కోరారు.


ఆదివాసీ ద్రోహులు  :


ఆదివాసీల ఓట్లతో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పాలకులు వారి జీవితాలకే తూట్లు పొడుస్తున్నారని గోపి మండిపడ్డారు. ఆదివాసీ ద్రోహులుగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి, మాజీ మంత్రి మణికుమారి సహా అనేకమంది టీడీపీ నేతల పేర్లను ఆ లేఖలో ప్రస్తావించారు. అభం శుభం తెలియని గిరిజనులపై జరుగుతున్న పోలీస్ దాడుల వెనక టీడీపీ నాయకుల పరోక్ష సహకారం ఉందని ఆరోపించారు. ఇకనైనా పోలీస్ దాడులని ఆపకపోతే రానున్న రోజులలో టీడీపీ నాయకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని గోపీ హెచ్చరించారు. మొత్తానికి మావోయిస్టుల నుంచి వచ్చిన ఈ లేఖ ఇపుడు రాజకీయ వర్గాలలో అలజడి రేపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: