అందరూ అనుకుంటున్నట్లుగానే శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కూడ భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్ధితులు, నేతల పరిస్ధితులపై చర్చించారట. స్వామికి ధక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.  

 

పార్టీలోని పరిస్ధితులను చూస్తుంటే బిజెపికి పరిపూర్ణానంద స్వామి ఒక్కరే దిక్కులాగ కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం పార్టీకి అంటే రెండు రాష్ట్రాల్లో కూడా క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న నేతలు లేరనే చెప్పాలి. ఇటువంటి నేపధ్యంలో లక్షల సంఖ్యలో భక్తులున్న పరిపూర్ణానంద స్వామి మాత్రమే దిక్కుగా కనిపించటంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా స్వామికి కూడా రాజకీయ వాసనలు చాలానే ఉన్నాయి.

 

చాలామంది రాజకీయ, సామాజిక అంశాల్లో అప్ డేట్ గా ఉంటున్నట్లే స్వామి కూడా రాజకీయ, సామాజిక అంశాల్లో అప్ డేట్ గానే ఉంటారు. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలపై పలు అంశాలపై టివిల్లో చర్చలకు హాజరవుతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. పూర్తిస్ధాయి రాజకీయ నేతలు ఎంతలా తమ వాదనలు వినిపిస్తుంటారో స్వామి కూడా అంతే స్ధాయిలో తన అభిప్రాయాలను చెబుతుంటారు.


అదే సమయంలో తన ఆలోచనలకు, బిజెపి సిద్దాంతాలకు దగ్గర సంబంధాలున్నాయని అప్పుడప్పుడు చెబుతున్న విషయం అందరూ చూసిందే. దాంతోనే స్వామి త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. అది కాస్త ఇపుడు వాస్తవమైంది. అన్నీ అనుకూలిస్తే బహుశా వచ్చే ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: