చూడబోతే పరిస్దితి అలాగే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా కన్ఫ్యూషన్లో ఉన్నట్లున్నారు. ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తానంటారు. మరోసారి ఇంకా తేల్చుకోలేదంటారు. ఇంకోసారి 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ప్రధామికంగా నిర్ణయించామంటారు. పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే అసలు నోరే మొదపరు. ఇంత అయోమయం మరో పార్టీ అధినేతలో కనబడదు. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు తెలంగాణా విషయంలో కూడా అదే అయోమయం. దాంతో నేతలు, క్యాడరే ఎప్పటికప్పుడు అయోమయంలో పడి జుట్టు పీక్కుంటున్నారు.

 

ఆమధ్య తెలంగాణాలో ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ, 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి నిర్ణయించామని మిగిలిన సీట్ల విషయం తర్వాత ఆలోచిస్తామన్నారు. అదే విషయంపై త్వరలో పార్టీలోని తెలంగాణా నేతలతో భేటీ కూడా అవ్వబోతున్నారు. దాంతో అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల పోటీ విషయంలో అప్పటికి ఓ నిర్ణయం వస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడే ఓ అనుమానం అందరిలోను మొదలైంది.


అసలు తెలంగాణాలో పోటీ చేసే విషయంలో పవన్ కు క్లారిటీ ఉందా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే ఒకసారి టిఆర్ఎస్ చీఫ్ కెసియార్ తో భేటీ అయ్యారు. అప్పుడు తెలంగాణాలో ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై చర్చకు వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజానికి తెలంగాణాలో కూడా పవన్ కు బాగానే అభిమానులున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో జనసేన పోటీ చేస్తే అభిమానుల్లో ఎక్కువమంది పవన్ కు అనుకూలంగానే ఓట్లేసే అవకాశం ఉంది. సరే, జనసేన పోటీ చేయకపోతే వాళ్ళంతా ఎవరికి ఓట్లేసేది వేరే విషయం అనుకోండి.

 

అందుకనే పోటీని తెలంగాణాలో కాకుండా ఏపికి మాత్రమే పరిమితం చేయమని కెసియార్ కోరినట్లు సమాచారం. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. మొత్తానికి కెసియార్ తోనే కాకుండా కొడుకు కెటియార్ తో కూడా పవన్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకనే మొన్నటి ధవళేశ్వరం బ్యారేజిపై పవన్ కవాతును కెటియార్ మెచ్చుకున్నారు. కవాతు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ విషయం బయటకు వచ్చిన దగ్గర నుండి  చంద్రబాబునాయుడు ఉడికిపోతున్నారు.  

 

ఇవన్నీ చూస్తుంటే తెలంగాణాలో జనసేన పోటీ చేయాలంటే ముందు కెసియార్ పర్మిషన్ ఇవ్వాలేమో అన్న అనుమానం వస్తోంది. ఒకవైపు కెసియార్, కెటియార్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న కారణంగా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న అనుమానం వస్తోంది. టిఆర్ఎస్ తో పొత్తులంటే ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. ఎందుకంటే  ఇప్పటికే కెసియార్ 105 సీట్లలో అభ్యర్ధులను డిక్లేర్ చేసేశారు. ఇంక ప్రకటించాల్సింది 14 సీట్లే. ఆ టిక్కెట్ల విషయంలోన పార్టీలో తీవ్రస్ధాయిలో పోటీ జరుగుతోంది.  కాకపోతే ఎంఐఎంతో ఉన్నట్లే జనసేనతో కూడా ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: