నెల్లూరు జిల్లా వైసిపి నేతల్లో ఫుల్లు జోష్ కనబడుతోంది. కారణమేమిటంటే నెల్లూరు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒకే వేదికపై కనిపించటమే. మాజీ మంత్రి ఆనం ఈ మధ్యనే వైసిపిలో చేరిన విషయం తెలిసిందే కదా. టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాలన్న ఆనం కోరిక చాలా కాలం కోరికగానే మిగిలిపోయింది. ఎందుకంటే, ఆనం చేరికను వైసిపిలోని నేతలు వ్యతిరేకించారు.

 

ఆనం చేరికను వ్యతిరేకించిన వారిలో నెల్లూరు సిటి, రూరల్ ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రధానం. ఆనం చేరికను వ్యతిరేకించటంలో ఉద్దేశ్యమేమిటంటే ఆనం సోదరుల వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరెస్తుందో అన్న భయంతోనే వ్యతిరేకించారు. అయితే, హఠాత్తుగా ఆనం వివేకానందరెడ్డి మరణించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆనం రామనారాయణరెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయింది.

 

విశాఖపట్నం పాదయాత్ర సందర్భంగా జగన్ సమక్షంలో ఆనం చేరారు. ఆనం చేరిక సందర్భంగా కోటంరెడ్డి, అనిల్ తో పాటు పలువురు నేతలు హాజరైనా మేకపాటితో పాటు ఆయన కొడుకు, ఆత్మకూరు ఎంఎల్ఏ మేకపాటి గౌతమ్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ఆనం  చేరిక సందర్భంగా మేకపాటి కుటుంబం వైజాగ్ వచ్చినా పార్టీలో  చేరే సమయానికి మాత్రం మాయం అయిపోయారు. దాదాపు నెలన్నరగా ఇద్దరి మధ్య పెద్ద సఖ్యత కనిపించలేదు.

 

అయితే, తాజాగా తెలుగుదశంపార్టీ నుండి పలువురు నేతలు వైసిపిలో చేరారు. వారంతా ఆనం కారణంగానే వైసిపిలో చేరారు. ఆ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆనంతో పాటు మేకపాటి కూడా పాల్గొన్నారు. వారిద్దరినీ ఒకే వేదికపై చూసిన మిగిలిన నేతల్లో జోష్ కనబడింది. ఇద్దరు నేతలు కలిసిపోతే పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎదురేలేదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: