నువ్వు దొంగంటే  కాదు నువ్వే దొంగ...

నీదంతా అక్రమాస్తులే అంటే కాదు నీవే అక్రమాస్తులు...

 ఇది తాజాగా తిరుపతిలో ప్రస్తుత ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏ మధ్య మొదలైన వివాదం. మొత్తానికి తేలిందేమిటంటే ఇద్దరివీ అక్రమాస్తులేనని. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీ ఎంఎల్ఏ, టిటిడి ట్రస్టుబోర్డు మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన సంగతి అందరికీ తిలిసిందే. చేరిన ఆయన చేరినట్లుండకుండా తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ సుగుణమ్మ మీద బురదచల్లటం మొదలుపెట్టారు. తాను తెలుగుదేశంపార్టీని వదిలేయటానికి సుగుణమ్మ కారణమన్నారు.

 

ఎంఎల్ఏ అరాచకాలు, అక్రమ సంపాదనను చూడలేకే తాను పార్టీ మారినట్లు చెప్పారు. ఎంఎల్ఏ అరాచకాలను, అక్రమ సంపాదన విషయాలను చంద్రబాబునాయుడుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. పైగా ఎంఎల్ఏ బస్టాండు స్ధలం, పద్మావతిపురం, తిరుచానూరురోడ్డు, సూరారంతోట లాంటి వాటితో పాటు ఇంకా ఎక్కడెక్కడ అడ్డదారుల్లో ఎంతెంత సంపాదించిందో వివరించారు.  పార్టీకి, తిరుపతికి చెడ్డపేరు తెస్తున్న కారణంగానే ఎంఎల్ఏతో విభేదించి తాను తెలుగుదేశానికి రాజీనామా చేయాల్సొచ్చిందని చెప్పారు.

 

అరాచకాలను, అవినీతిని ఎవరు మాత్రం అంగీకరిస్తారు. అందుకే వెంటనే ఎంఎల్ఏ కూడా చదలవాడ పురాణం విప్పారు. అసలు చదలవాడ తిరుపతికి వచ్చినపుడు చదలవాడ పరిస్దితేంటి ? ఎక్కడెక్కడ ఎలా సంపాదించారు, ఎంతెంత ఆస్తులు కూడబెట్టారో చక్కగా పూసగుచ్చినట్లుగా వివరించారు. నిజానికి ఇద్దరి గురించి తిరుపతి ప్రజలకు తెలీంది కాదు. చదలవాడ నెల్లూరు జిల్లా గూడూరులో ఓ  కిరోసిన్ షాపు డీలర్ వద్ద చిరుద్యోగట.

 

ఏదో అంచలంచెలుగా ఎదుగుతూ తిరుపతికి చేరుకుని సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టి నిలదొక్కకున్నారు. చదలవాడకు ప్రస్తుతం తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు, డెంటల్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయట.  అదే విధంగా ఎంఎల్ఏ సుగుణమ్మ భర్త వెంకటరమణ కూడా మాజీ ఎంఎల్ఏనే. వెంకటరమణ కూడా సారాయి వ్యాపారం చేసేవారు. అందులో డబ్బు సంపాదించి కౌన్సిలరయ్యారు.

 

తర్వాత మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా ఆ తర్వాత ఛైర్మన్ గా పనిచేశారు. ఆ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకీ దిగారు. తర్వాత ఎంఎల్ఏ అయ్యారు. సో, వీళ్ళ అరోపణలు చూసిన తర్వాత అర్దమైందేమిటంటే ఇద్దరివీ అక్రమసంపాదన అని. ఇద్దరి ఆస్తుల విలువ కూడా వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అటువంటప్పుడు ఒకళ్ళ పురాణం మరొకరు విప్పకపోతే జనాలకు నిజాలు తెలిసేదెలా చెప్పండి ?


మరింత సమాచారం తెలుసుకోండి: